తాండూరు, జూన్ 27 : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కేసీఆర్ సర్కార్ హయాంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అనర్హులకు కేటాయించాలని చూస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. పట్టణంలోని ఖాంజాపూర్ శివారులో కేసీఆర్ సర్కార్ హయాంలో రెండువేల డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేసరికి దాదాపు వెయ్యి వరకు ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా మరో వెయ్యి ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నది.
శనివారం స్థానిక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, కలెక్టర్ దీపక్‌తివారీ డబుల్ బెడ్రూం ఇండ్లకు ఆన్లైన్ విధానంలో లాటరీ తీశారు. దీంతో బీఆర్ఎస్ తాండూరు మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ దీపానర్సింహులు, పార్టీ కౌన్సిలర్లు, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్‌గౌడ్ తదితరులు అధికార పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకా సగం ఇండ్ల నిర్మాణం పూర్తికాకుండానే డ్రా ఎలా తీస్తారని ఎమ్మెల్యేను నిలదీశారు. అర్హులైన పేదలకు కాకుండా వారి పార్టీకి అనుకూలంగా ఉన్నవారికే కేటాయించేందుకు కాంగ్రెస్ నాయకులు పన్నాగం పన్నారని మండిపడ్డారు. అనర్హులకు ఇండ్లను కేటాయిస్తే న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను అధికార పార్టీ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసులు వచ్చి ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను బలవంతంగా వ్యానులో ఎక్కించారు. అనంతరం ఎమ్మెల్యే, కలెక్టర్ లబ్ధిదారుల పేర్లను ప్రకటించారు.