బెంగళూరు, ఆగస్టు 4 : కర్ణాటక కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. మంత్రి పదవులు దక్కని సిద్ధరామయ్య వర్గ ఎమ్మెల్యేలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. రాజీనామాలు కూడా చేశారు. దీంతో వెళ్లేవాళ్లు వెళ్లొచ్చని పేర్కొన్న సీఎం డీకే.. వారి రాజీనామాలను నిమిషాల్లో ఆమోదిస్తానని వెల్లడించారు. మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కిన 19 మంది జాబితాపై మాజీ సీఎం సిద్ధరామయ్య అసంతృప్తిగా ఉన్నారు. దీనిపై ఆయన మద్దతుదారులు ముఖ్యమంత్రి డీకే శివకుమార్, అధిష్ఠానాన్ని ఉద్దేశించి మంగళవారం నేరుగానే విమర్శలు చేయగా, మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరైన సిద్ధరామయ్య మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు.
లోక్‌భవన్‌లో సోమవారం జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి సిద్ధరామయ్య హాజరు కాకపోవడం ద్వారా తన అసంతృప్తిని అధిష్ఠానానికి తెలియజేశారు. కాగా, సిద్ధరామయ్య పుట్టిన రోజు కావడంతో ఆయన దీనికి హాజరు కాలేదని, 19 మంది మంత్రుల ఎంపిక ప్రక్రియలో ఆయన కూడా పాల్గొన్నారని డీకే వెల్లడించారు. కురుబ వర్గానికి చెందిన బైద్గి ఎమ్మెల్యే బసవరాజ్ శివన్ననవర్కు, ఎంఎల్సీ ఉమశ్రీకి మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడం పట్ల సిద్ధరామయ్య అసంతృప్తిగా ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మంత్రివర్గ విస్తరణ తర్వాత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అసంతృప్తి ఎమ్మెల్యేలు పార్టీని వదిలి వెళ్లాలనుకుంటే వెళ్లవచ్చని, వారి రాజీనామాలను నిమిషంలో ఆమోదిస్తానని ఆయన ప్రకటించారు. కాగా, మంత్రివర్గ విస్తరణ తర్వాత ఎమ్మెల్యేలు యశ్వంతరాయగౌడ వీ పాటిల్, బెలూర్ గోపాలకృష్ణలు రాజీనామా చేసిన క్రమంలో డీకే ఈ ప్రకటన చేశారు. ‘ఎవరైనా రాజీనామా ఇస్తే నిమిషాల వ్యవధిలో దానిని ఆమోదిస్తా’ అని మంగళవారం ఆయన పేర్కొన్నారు. అసంతృప్తి ఎమ్మెల్యేలు సహనంతో ఉండాలని, వ్యక్తుల భవిష్యత్ కన్నా పార్టీ ప్రయోజనం ముఖ్యమన్న విషయాన్ని నేతలు గుర్తుంచుకోవాలని అన్నారు.