హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): తాము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో రెగ్యులరైజ్ చేస్తామని, మినిమం టైం స్కేల్ వర్తింపజేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదని సమగ్రశిక్షా ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ మండిపడింది. నాడు ఓట్లు వేయించుకొని నేడు పట్టించుకోకపోవడం దారుణమని తెలిపింది. బుధవారం కమిటీ నేతలు యాదగిరి, ఝాన్సీ, సౌజన్య, అనిల్‌చారి మాట్లాడుతూ ‘కాంగ్రెస్ ఎన్నికల హామీని నమ్మాం. కానీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు అయినా కూడా హామీని నెరవేర్చలేదు. ఈ 10 నెలల కాలంలో సీఎంతోపాటు మంత్రులను పలుసార్లు కలిసి హామీని నెరవేర్చాలని కోరాం.
కానీ ఇప్పటికీ ప్రయోజనం లేదు. అందుకే ఈ నెల 26న జరిగే క్యాబినెట్ సమావేశంలో మాకు ఇచ్చిన హామీపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే సమ్మె నోటీసులిస్తాం’ అని హెచ్చరించారు. ఉద్యోగ భద్రత లేకపోవడంతో 169 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని, వీరికి ప్రభుత్వం చిల్లిగవ్వ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. 61 ఏండ్లు నిండిన 100 మంది ఉద్యోగులను తొలగించారని, వీరికి ఎలాంటి ప్రయోజనాలు కల్పించలేదని వెల్లడించారు. సమగ్రశిక్షా ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని లేదా విద్యాశాఖలో విలీనం చేయాలని, తక్షణమే మినిమం టైం స్కేల్‌ను వర్తింపజేయాలని, ఆరోగ్యబీమా 10 లక్షలు, జీవిత బీమా 10 లక్షలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రూ. 10లక్షల సౌకర్యం కల్పించాలని, ఉద్యోగాల భర్తీలో వెయిటేజీ కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు.
ఇంటర్లో మరో 23 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. ఈ మేరకు విద్యాశాఖ బుధవారం జీవో-35ను జారీచేసింది. వీరు గతంలోనే రెగ్యులరైజ్ కావాల్సి ఉండగా అప్పట్లో అధికారులు వీరిని పక్కనపెట్టారు. క్రమబద్ధీకరించిన వారిలో తెలుగు, హిందీ, ఎకనామిక్స్, సివిక్స్, గణితం, కెమిస్ట్రీ, కామర్స్, బోటనీ సబ్జెక్టుల లెక్చరర్లు ఉన్నారు.