నల్లగొండ ప్రతినిధి, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌లో బీజేపీ శ్రేణులకు ఓటర్లు చుక్కలు చూపించారు. పోలింగ్ సందర్భంగా బీజేపీ నేతల వ్యవహారశైలితో తీవ్ర ఇబ్బందులు పడ్డ ఓటర్లు తిట్ల దండకం అందుకుని శాపనార్థాలు పెట్టారు. దాంతో మధ్యాహ్నం నుంచి బీజేపీ శ్రేణులు చేతులెత్తేశాయి. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లు బీజేపీని తిట్టుకుంటూ టీఆర్ఎస్కు ఓట్లు గుద్దినట్టు పోలింగ్ సరళి స్పష్టం చేసింది. ప్రచారం సందర్భంగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డితో పాటు ఆ పార్టీ నేతలు ప్రజలకు భారీ ఆశలు కల్పించారు.
పోలింగ్ సందర్భంగా బీజేపీ నుంచి ఓటర్లకు పెద్ద ఎత్తున నగదు, బంగారం అందుతుందని ఆ పార్టీ నేతలే పలు సందర్భాల్లో లీకులు ఇవ్వడంతో ప్రజలు ఆశగా ఎదురుచూశారు. తీరా పోలింగ్‌కు ముందు రోజు కొన్ని ప్రాంతాల్లోని కొద్ది మంది ఓటర్లకే నగదు పంపిణీ జరుగడంతో మిగిలిన ఓటర్లు అసహనానికి గురయ్యారు. ఓటేసేందుకు కూడా రాబోమంటూ వారంతా భీష్మించుకు కూర్చున్నారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటి నుంచే ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్ద ఉన్న బీజేపీ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కనిపించారు.
తమ గ్రామాల్లో కొద్ది మందిపైనే ప్రత్యేక ప్రేమ కనబరుస్తూ ఎక్కువ మందిని నిర్లక్ష్యం చేయడమేంటని వీధుల్లోకి వచ్చారు. బీజేపీ శ్రేణులపై తిరుగుబాటు చేశారు. మునుగోడు మండలం కొరటికల్‌లో తమకు నగదు ఎందుకు ఇవ్వరంటూ బీజేపీ నేతలు ఆ పార్టీ నేతల ఇండ్ల వద్ద ధర్నాకు దిగారు. తమకు బహుమతులు ఇవ్వాల్సిందేనని వాదన చేస్తూ ఆందోళన కొనసాగించారు. రాజగోపాల్‌రెడ్డి పంపిస్తే… తమకు ఇవ్వాల్సిన డబ్బును దాచుకుంటారా అంటూ నిలదీశారు. చివరకు పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.
బీజేపీ నేతల తీరుపై ఆగ్రహం
సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకలోనూ మహిళా ఓటర్లు బీజేపీ నేతల తీరు పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఊరిలో డబ్బులు కొద్ది మందికే ఇచ్చి తమకు ఇవ్వకపోవడం ఏంటని నిలదీశారు. ఏకంగా మీడియా ముం దుకు వచ్చి బీజేపీ నేతల తీరును దుయ్యబట్టారు. మర్రిగూడ మండలం అంతంపేటలో ఓటర్లు బీజేపీ అభ్యర్థ్ధి రాజగోపాల్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సాయంత్రం వరకు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. చివరకు పోలీసులు నచ్చజెప్పడంతో ఓటింగ్‌కు హాజరయ్యా రు. వార్డుల్లో ఇదే పరిస్థితి కనిపించింది. ఇక చాలా గ్రామాల్లో బీజేపీ నేతల తీరుతో ఓటర్లు మధ్యాహ్నం వరకు పోలింగ్ బూత్‌లకు రావడానికి విముఖత చూపారు.
మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41.3 శాతం మాత్రమే నమోదైంది. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి ఓటర్లు మెల్లిగా పోలింగ్ బూతులకు బారులు తీరారు. బీజేపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలింగ్ కేంద్రాల్లో కనిపించారు. ఇప్పుడే ఇంత మోసం చేస్తే భవిష్యత్తులో ఏంటని ప్రశ్నిస్తూ ఓటర్లు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపినట్టు కనిపించింది. సాయంత్రం జోరుగా సాగిన పోలింగ్‌లో టీఆర్ఎస్ ట్రెండ్ కొనసాగినట్లు స్పష్టమైంది. దీంతో ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు కూడా టీఆర్ఎస్ గెలుపునే సూచించడం విశేషం.
మా ఊరికెందుకు వచ్చినవ్.. రాజగోపాల్‌కు చేదు అనుభవం
మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం గ్రామంలోని హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సరళిని పరిశీలించేందుకు గురువారం బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి రాగా.. స్థానికులు, టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. తమ గ్రామాన్ని, నిర్వాసితులను ఎన్నడూ పట్టించుకోని రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడు ఓట్ల కోసం వచ్చిండని, ఇక్కడి నుంచి తక్షణం వెళ్లిపోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరంపేట గ్రామంలో కూడా గ్రామస్థులు రాజగోపాల్‌రెడ్డిని ఆడ్డుకున్నారు. రాజగోపాల్‌రెడ్డి తమను దూషించాడని టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేశారు.