హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ సేవల కారణంగా అంగన్వాడీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉన్న సమయమంతా ఆన్లైన్ ఆప్డేషన్కే సరిపోతున్నది. దీంతో కేంద్రాలపై దృష్టి సారించలేకపోతున్నారు. తీవ్ర ఒత్తిళ్లు పెరిగి అనారోగ్యాలకు గురవుతున్నారు. ఫలితంగా అంగన్వాడీ కేంద్రాల లక్ష్యం దెబ్బతింటున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఐసీడీఎస్ పథకాల కోసం వివరాలను ఎప్పటికప్పుడు మొబైల్ యాప్ ద్వారా అంగన్వాడీ టీచర్లు అప్డేట్ చేయాలి. ఈ మేరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు వారికి ఇదే పని సరిపోతున్నది.
దీంతో వారంతా మొబైళ్లు, యాప్ సర్వీసులతోనే సమయమంతా కేటాయించాల్సి వస్తున్నది. దీంతోపాటు అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు సంబంధించిన రోజు వారీ డేటా కూడా పంపాలి. రోజు అంగన్వాడీలకు ఎంత మంది పిల్లలు వచ్చారు? ఎంత మంతి గర్భిణులు, బాలింతలు వచ్చారు? ఎందరు భోజనం చేశారు? ఏ రోజు ఎలాంటి కూరలతో భోజనం పెట్టారు? వచ్చిన వారికి పాలు అందించారా? బాలామృతం, గుడ్డు సరఫరా వంటి పరిస్థితి ఏమిటి? వంటి సర్వం మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేయాలి.
పిల్లలతో, గర్భిణులు, బాలింతలతో ఫొటోలు దిగి వాటిని కూడా యాప్‌లో అప్లోడ్ చేయాలి. ఒక పక్క ఈ విధంగా మొబైల్ సేవలు అందిస్తుంటే.. మరోపక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రకరకాల సర్వేలలో కూడా అంగన్వాడీలు తప్పనిసరిగా పాల్గొనాల్సి వస్తున్నది. ఆ సర్వేలకు సంబంధించిన వివరాలు కూడా మొబైల్ యాప్‌ల ద్వారా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నారు. 2018లో ప్రతి అంగన్వాడీ టీచర్‌కు మొబైల్ అందించారు. అవి అప్పటి అవసరాలకు సరిపోయాయి. ఇప్పు డు ఆ పాత మొబైళ్లు మొరాయిస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న సేవల నేపథ్యంలో పాత మొబైళ్లు సరిగా పని చేయడమే లేదు.