నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 23: హనుమకొండ, మార్చి 23 : తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్లు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడించారు. కనీస వేతనం రూ.26 వేలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ ఆడిటోరియం నుంచి వందలాది మంది అంగన్వాడీలు ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. రెండు గేట్ల ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ బయటికి రావాలని నినాదాలు చేస్తూ గేట్లను తోసుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అంగన్వాడీలు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకోగా స్వల్ప ఉద్రిక్తత నెలకొన్నది.
అంగన్వాడీలతోపాటు సీఐటీయూ నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంగన్వాడీ టీచర్లు వికారాబాద్ కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. కార్యాలయ గేటు వద్ద ధర్నా నిర్వహించారు. నిజామాబాద్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, భద్రాద్రి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల కలెక్టరేట్ల వద్ద అంగన్వాడీలు ధర్నా చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి ప్రభుత్వానికి బుద్ధిచెబుతామని హెచ్చరించారు.