సిద్దిపేట, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అంగన్వాడీ టీచర్లకు దేశంలోనే అత్యధిక వేతనాలు ఇస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు చెప్పారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్సహా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అంగన్వాడీ టీచర్లకు తక్కువ వేతనాలు ఉన్నాయని తెలిపారు. కానీ, మన తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు రూ.13,650, మినీ అంగన్వాడీ టీచర్లకు రూ.7,800, హెల్పర్లకు రూ.7,800 చొప్పున వేతనాలు ఇస్తున్నామని, ఇలా దేశంలో మరేదైనా రాష్ట్రంలో ఉన్నదా? అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
బుధవారం సిద్దిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 21 మంది అంగన్వాడీ టీచర్లు, ఏడుగురు మినీ అంగన్వాడీ టీచర్లు, 76 అంగన్వాడీ హెల్పర్లు, మొత్తం 104 మందికి ఆయన నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అంగన్వాడీల వేతనాల్లో కేంద్రం వాటా 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 10 శాతం ఉండేదని గుర్తు చేశారు. మోదీ సర్కారు వాటాను 90 శాతం నుంచి 60 శాతానికి తగ్గించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల వాటాలను 10 శాతం నుంచి 40 శాతానికి పెంచి కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నదని విమర్శించారు.
రాష్ట్రంలో పెరిగిన వేతనాల ప్రకారం కేంద్ర వాటా 60 శాతం ఉండాల్సి ఉండగా.. అంగన్వాడీ టీచర్ల వేతనాల్లో 19 శాతం, హెల్పర్ల వేతనాల్లో 17 శాతం మాత్రమే ఇస్తున్నదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ వేతనాలకు తన వాటా కింద 40 శాతం ఇవ్వాల్సి ఉండగా.. 80 శాతం, హెల్పర్ల వేతనాల్లో 82 శాతం ఉండటం సీఎం కేసీఆర్ ఔదార్యానికి, అంగన్వాడీలపై ఆయనకు ఉన్న ప్రేమకు నిదర్శనమని పేర్కొన్నారు. తద్వారా రాష్ట్రంలోని 67,411 మంది అంగన్వాడీలకు లబ్ధి చేకూరుతున్నదని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీల వేతనాలను 2018 సెప్టెంబర్‌లో ఒకసారి పెంచితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ మూడు సార్లు అంగన్వాడీల వేతనాలను పెంచినట్టు గుర్తుచేశారు.
దేశంలో ఎక్కడా ఈ స్థాయి వేతనాలు లేవు
దేశంలో తెలంగాణ తరహాలో ఎక్కడా ఇంత పెద్ద మొత్తంలో వేతనాలు ఇవ్వడం లేదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఢిల్లీ, కేరళలో రూ.10 వేలు ఇస్తుంటే, మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో రూ.7 వేలు మాత్రమే ఇస్తున్నారని గుర్తు చేశారు. హెల్పర్ల వేతనం రూ.5 లేదా రూ.6 వేలకు మించడం లేదని చెప్పారు. మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో రూ.7,800, బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో రూ.8 వేల వేతనం ఇస్తున్నారని అన్నారు. కేంద్రం ఇచ్చే గౌరవ వేతనంతో సంబంధం లేకుండా సీఎం కేసీఆర్ అంగన్వాడీలకు వేతనాలు పెంచారని తెలిపారు. అరకొర సౌకర్యాలు, అగౌరవంగా నడిచే అంగన్వాడీలను పక్కా భవనాలు, స్కూళ్లలోకి మార్చి మరింత గౌరవం పెంచాలని సీఎం ఆలోచిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో ప్రతి మహిళ సాధికారత దిశగా అడుగులేస్తున్నారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంగన్వాడీ టీచర్ల వేతనాలు పెరిగాయి ఇలా..