నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 30 : ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై కాంగ్రెస్ సర్కార్‌పై ఆశా వర్కర్లు కన్నెర్ర చేశారు. సోమవారం ‘చలో హైదరాబాద్’కు వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేయడంపై మండిపడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆశా కార్యకర్తలు రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని 44వ జాతీయ రహదారిని దాదాపు గంటన్నరపాటు దిగ్బంధించారు. దీంతో హైదరాబాద్-బెంగళూర్ వైపు వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసి నా ససేమిరా అన్నారు.
దీంతో వారిని బలవంతంగా ఈడ్చుకుంటూ రోడ్డుపై నుంచి పక్కను నెట్టేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ఆశావర్కర్ల మధ్య తోపులాట జరగటంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో సీఐటీయూ కార్మిక విభాగం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జయలక్ష్మితోపాటు మరికొందరు ఆశా వర్కర్లు సొమ్మసిల్లి పడిపోయారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు ప్రధాన రహదారులపై రాస్తారోకోలతోపాటు పీహెచ్‌సీల ఎదుట ధర్నాలు నిర్వహించి వైద్యాధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. సూర్యాపేటలో భారీ ర్యాలీ నిర్వహించి కొత్త బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టారు. నల్లగొండలోని సుభాష్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కూసుమంచి (నేలకొండపల్లి)/ రఘునాథపాలెం, మార్చి 30 : గ్రామీణ ప్రాంతాల్లో మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా నేలకొండపల్లి తహసీల్దార్ కార్యాల యం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఎకరాకు 20 క్వింటాళ్ల నిబంధన ఎత్తివేయాలని, మక్కజొన్న పంటను మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశా రు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. జిల్లాలో మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్లోని గ్రీవెన్స్‌లో కలెక్టర్ అనుదీప్నకు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దొండపాటి రమేశ్ వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రూ.2,400 మద్దతు ధర ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కొనుగోలు జరగడం లేదని పేర్కొన్నారు.