హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : పది నెలలుగా ప్రభుత్వం తమకు సగం జీతాలనే చెల్తిస్తున్నదని, నిరుడు మార్చి నుంచి ఇప్పటి వరకు ఇదే తీరున చెల్లిస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నదని, వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని మినీ అంగన్వాడీల టీచర్లు మంగళవారం ప్రజాభవన్ వద్ద ధర్నా చేశారు. ముందుగా ప్రజాభవన్‌కు చేరుకున్నవారిని లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీచర్లంతా అక్కడే బై ఠాయించి ఆందోళనకు దిగారు. సర్కారు తీరుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్రజావాణి ఇన్చార్జి చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్యా దేవరాజన్‌కు వినతి పత్రం అందచేశారు.
అంతకు ముందు బేగంపేట రైల్వే స్టేషన్ నుంచి ప్రజాభవన్ వరకు భారీ ర్యాలీ తీశారు. పోలీసులు రెండుసార్లు ర్యాలీని అడ్డుకున్నా పట్టువదలకుండా ప్రజాభవన్‌ను చేరుకున్నారు. కాగా చాలా మందిని సోమవారం రాత్రి నుంచే పోలీసులు ఎక్కడివారిని అక్కడ అరెస్ట్ చేశారు. కొంతమందిని మంగళవారం ఉదయం కూడా పోలీసు స్టేషన్లకు తరలించారని అంగన్వాడీ టీచర్ల సంఘం రాష్ట్ర నాయకులు కే సునీత, పీ జయలక్ష్మీ తెలిపారు. అనేక పోరాటాల నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలోని 4 వేల మంది మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా గుర్తిస్తూ జనవరి 1 ఉత్తర్వు లు జారీ చేసిందని, కానీ, ఇప్పటికీ మినీ అంగన్వాడీలకు ఇచ్చే జీతాలనే (అంటే సగం జీతాలు) చెల్లిస్తున్నారని తెలిపారు.