హైదరాబాద్ మే 29 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయనున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద అంగన్వాడీ టీచర్‌కు రూ. 2లక్షలు, హెల్పర్‌కు రూ. లక్ష ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్కారు నిర్ణయంతో సుమారు 70 వేల మందికి ప్రయోజనం చేకూరనున్నది.
అధికారంలోకి రాగానే అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రూ. 2 లక్షలు, రూ. లక్ష చొప్పున ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. గద్దెనెక్కిన వెంటనే రిటైర్మెంట్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. కానీ బెనిఫిట్స్ ఇవ్వడం మాత్రం మరిచిపోయింది. దీంతో సుమారు 10 వేల మంది టీచర్లు, సహాయకులు బెనిఫిట్స్ ప్రయోజనాల కోసం ఎదురుచూస్తున్నారు.
పలువురు ప్రయోజనాలు పొందకుండానే మరణించారు. అయితే ఇప్పుడు ఆఘమేఘాలపై రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని నిర్ణయించడంపై అంగన్వాడీ యూనియన్ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే పంచాయతీ ఎన్నికల నగారా మోగనున్నదనే వార్తలు వస్తున్న తరుణంలో ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని నిర్ణయించిందని సందేహం వ్యక్తం చేస్తున్నారు.