Anganwadi Teachers | హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో పని చేస్తూ 65ఏండ్లు నిండిన టీచర్లను, ఆయాలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ రెండు నెలల క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఉద్యోగ విరమణ పొందిన టీచర్లకు బెనిఫిట్స్ కిందరూ.2లక్షలు, ఆయాలకు రూ.లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు నోరు మెదపడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెనిఫిట్స్‌కు సంబంధించి ఎలాంటి జీవో విడుదల కాలేదని అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, వీటిల్లో పని చేస్తున్న టీచర్లు, ఆయాలకు వాస్తవానికి ఉద్యోగ విరమణ అనేది లేదు. బీజేపీ ప్రభుత్వం 2022లో 65 ఏండ్లు వచ్చేంత వరకు మాత్రమే ఈ కేంద్రాల్లో పని చేసేందుకు అర్హులుగా పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది.
దీంతో రిటైర్మెంట్ అయిన 5వేల మంది ఉద్యోగ విరమణ పొంది రెండు నెలలైందని, తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను బలవంతంగా ఉద్యోగ విరమణ చేయించిన ప్రభుత్వం బెనిఫిట్స్ చెల్లించకుండా చోద్యం చూస్తున్నదని అంగన్వాడీ టీచర్లు మండిపడుతున్నారు.