హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అంగన్వాడీల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లంతా ఉద్యమానికి నడుం బిగించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలనే డిమాండ్లతో తెలంగాణ అంగన్వాడీ టీచర్ల, హెల్పర్ల అసోసియేషన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ఇందులోభాగంగా ఈనెల 17,18న జిల్లా కలెక్టరేట్ల్ల ముట్టడితోపాటు అక్కడే 48 గంటలపాటు వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు సంబంధించిన అనేక సమస్యలు పెండింగ్లో ఉండగా.. వాటిని పరిష్కరించడానికి కాంగ్రెస్ సర్కారు ముందుకు రావడం లేదని విమర్శించారు. సమస్యలపై మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి సమీక్షలకే పరిమితమయ్యారని తెలిపారు. ముఖ్యంగా 1వ తేదీన జీతాలు ఇవ్వడంతోపాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.1లక్ష ఇవ్వాలని పేర్కొన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ టీచర్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. పదినెలలుగా సగం జీతాలు చెల్లిస్తుండటంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.
మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను రద్దుచేసి పాత విధానంలోనే ఐసీడీఎస్ సేవలు కొనసాగించాలని సూచించారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న టీచర్లు, హెల్పర్ల ఉద్యోగాలు భర్తీ చేసి అంగన్వాడీలకు నెలకు రూ. 18,000 వేతనంతోపాటు పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ల బలోపేతం కోసం నిధులు కేటాయించి.. పక్కా భవనాలు నిర్మించాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టీచర్లు, ఆయాలకు గ్రాడ్యూటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెంగింగ్లోని టీఏ, డీఏ, ఇంక్రిమెంట్, అలవెన్స్లను వెంటనే చెల్లించాలని కోరారు. ఈవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35వేల అంగన్వాడీలలో సమస్యలు పరిష్కరించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం మొత్తం 23 రకాల డిమాండ్లు పరిష్కరించేంత వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు హెచ్చరించారు.