హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం ఐదు నెలలుగా గ్యాస్, కూరగాయల బిల్లులు చెల్లించటం లేదని అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నుంచి ఆగస్టు వరకు చెల్లించాల్సిన బిల్లులను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇవే పరిస్థితులు ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లోనైతే జనవరి నుంచి ఇప్పటి వరకు బిల్లులు రావటం లేదని తెలంగాణ రాష్ట్ర అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సంఘం నాయకులు చెప్తున్నారు. మంత్రులు, అధికారులను కలిసినా ప్రయోజనం లేదని, ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని సకాలంలో పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
పెరిగిన పనిభారం
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో 35,700 టీచర్లు, 35,700 మంది హెల్పర్ పోస్టులు ఉన్నాయి. రెండు నెలల క్రితం వరకు అన్ని పోస్టులు నిండుగానే ఉన్నాయి. కాని కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన చట్టం ప్రకారం 65 ఏండ్లు దాటిన వాటిని విధుల నుంచి తొలగించారు. దాంతో 7000 వరకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ స్థానాల్లో కొత్తవారిని ఎంపిక చేయలేదు. ఉన్నవారితోనే అదనపు సేవలు వినియోగించుకుంటున్నారు. దీంతో ఒకటి కంటే ఎక్కువ కేంద్రాల్లో టీచర్‌గా, ఆయాగా పని చేయాలంటే సాధ్యం కావటం లేదని, పనిభారం పెరుగుతున్నదని అంగన్వాడీ టీచర్లు తెలిపారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.