Anganwadi | హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలను క్రమబద్ధీకరిస్తాం’ ఇదీ ఎన్నికల ముందు కాం గ్రెస్ ఇచ్చిన కోటిన్నొక్క హామీల్లో ఒకటి. మరిప్పుడు ఆ హామీ గురించి కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడమే లేదు. ఈ విషయమై పలుమార్లు ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు వెళ్తే పట్టించుకునే నాథుడే లేదని అంగన్వాడీ అసోసియేషన్ ప్రతినిధులు వాపోతున్నారు.
పోస్టులను క్రమబద్ధీకరించడంతోపాటు వేతన స్కేల్ పెంచాలన్న డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లకు రూ.13,400 మాత్రమే వేతనం చెల్లిస్తుండగా, రూ.21 వేలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ఇదే దశలో వేతన పెంపు అంశం పై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సానుకూలతను వ్యక్తం చేయడంతో దీనిపై గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు అంగన్వాడీ టీచర్లు చెప్తున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం మంత్రులు, అధికారులు చుట్టూ తిరుగుతున్నామని టీచర్లు, ఆయాలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అంగన్వాడీల సమస్యలను పట్టించుకోని రేవంత్రెడ్డి సర్కారుపై అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఆగ్రహంతో ఉన్నారు.