హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కుట్ర పూరిత వ్యవహార శైలికి ఈ లేఖ ఒక నిదర్శనం. సీడబ్ల్యూసీకి సమర్పించిన తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్లను ఆమోదించొద్దని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 29న ఓ లేఖ రాసింది. గోదావరి పరీవాహక ప్రాంతంలో తెలంగాణ 79 శాతం వాటా కలిగి ఉన్నది.
గోదావరిలో ఉత్పత్తి అయ్యే 1480 టీఎంసీల నికర జలాల్లో తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించిన నీరు 967.94 టీఎంసీలు అని సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముసాయిదా విభజన బిల్లు చర్చ సందర్భంగా శాసన సభ్యులకు అధికారికంగా సమాచారాన్ని అందజేశారు. అయినా ఇవాళ ఈ లేఖలో తొండి వాదాన్ని లేవనెత్తుతూ ఆంధ్రప్రదేశ్ వాటా 776 టీఎంసీలు, తెలంగాణ వాటా 650 టీఎంసీలు అని తప్పుడు సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్నది.