హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడి ఉద్యోగులను తెలంగాణకు పంపి ఇక్కడ మనవారి పొట్ట కొట్టేందుకు సిద్ధమైంది. తద్వారా ఏపీలో పనిచేస్తున్న 1,943 మంది ఉద్యోగులను త్వరలో తెలంగాణకు కేటాయించనున్నారు. వీరిలో పోలీస్ విభాగానికి చెందినవారు ముఖ్యంగా టీజీఎస్పీ బెటాలియన్స్కు చెందినవారే దాదాపు 200 మంది ఉంటారని సమాచారం. వారిలో అత్యధికులు పైస్థాయి క్యాడర్ వారే. వారిని తెలంగాణలో చేర్చుకోవడం లాంఛనమేనన్న ప్రచారం జరుగుతున్నది. దీనిపై తెలంగాణ పోలీసులు రగిలిపోతున్నారు. ఏపీ నిర్ణయానికి సీఎం రేవంత్‌రెడ్డి సమ్మతిస్తే అన్ని ఉద్యోగ సంఘాలను కూడగట్టి తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న వేల పోస్టులను భర్తీ చేయకుండా ఏపీ నుంచి పోలీస్ ఉద్యోగులను తెప్పించుకోవడం ఏమిటని తెలంగాణ బెటాలియన్ల సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ఇదే జరిగితే మన ఉద్యోగాలు దూరమవడం ఖాయమని, కొత్త రిక్రూట్మెంట్లు, ఉద్యోగోన్నతులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమకు చాలా ఏండ్ల నుంచి ప్రమోషన్లు లేవని, ఆ ఫైళ్లు ఇప్పుడిప్పుడే ముందుకు కదులుతున్నాయని అంటున్నారు. ఇలాంటి తరుణంలో ఏపీ వారిని తెచ్చి తమపై కూర్చోబెడితే ర్యాంకులు, సీనియార్టీ ప్రకారం వారికే ఆ ఉద్యోగోన్నతులు దక్కుతాయని, తాము మళ్లీ అన్నింట్లో వెనుకబడిపోతామని ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బంది వాపోతున్నారు. తెలంగాణలో ‘ఏక్ పోలీస్’ విధానాన్ని అమలు చేస్తామంటూ ఎన్నికల సమయంలో మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. తీరా ఆ విధానానికి స్వస్తి పలుకడంపై కుటుంబసభ్యులతో కలసి ఆందోళనలకు దిగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనలతో దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో తెలంగాణ బెటాలియన్ల సిబ్బంది ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా డ్యూటీలు చేసుకున్నారని గుర్తుచేస్తున్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ ఏపీ ఉద్యోగుల అంశాన్ని తెరపైకి తెచ్చి తమకు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ‘ఏపీ పోలీసులు మాకొద్దు’ అంటూ టీజీఎస్పీలో క్రమంగా నినాదాలు జోరందుకుంటున్నాయి. ప్రస్తుతం ఎక్కడ నలుగురు పోలీసులు గుమికూడినా ఇదే అంశంపై చర్చిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఏపీ అధికారుల తీరుతో విధులు చేయలేక నలిగిపోతున్నామని, మళ్లీ అదే ఏపీ నుంచి ఉద్యోగులను తెచ్చి తమపై రుద్దడం ప్రభుత్వానికి న్యాయం కాదని స్పష్టం చేస్తున్నారు.
రాష్ట్ర విభజన సమయంలో కమలనాథన్ కమిటీ ఉద్యోగుల పంపిణీని చేపట్టడంతో నాటి కేసీఆర్ సర్కార్ 2,300 మందికిపైగా ఉద్యోగులను తెలంగాణకు రప్పించింది. వారి రాక వల్ల కొత్త రిక్రూట్మెంట్లు, పదోన్నతుల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ చేసి, తెలంగాణ ఉద్యోగులను అక్కున చేర్చుకున్నది. అప్పట్లో ఏపీ సర్కార్ అక్కడి ఉద్యోగులను తెలంగాణకు పంపాలని చూసింది. ఆ కుట్రలను పసిగట్టిన కేసీఆర్ అంతర్రాష్ట్ర బదిలీలను నిలిపివేయించారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి సర్కార్ అలా ఎందుకు చేయడం లేదని తెలంగాణ ఉద్యోగులు నిలదీస్తున్నారు. స్వరాష్ట్ర ఉద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రేమ లేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఏపీ జీఏడీ ఇచ్చిన సర్క్యులర్‌కు రేవంత్‌రెడ్డి సర్కార్ ఆమోదం తెలిపితే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తామని హెచ్చరిస్తున్నారు.