హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): చారిత్రక రక్షణల కింద కృష్ణా డెల్టాకు బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసిందని, వాటిని మార్చలేరని ఏపీ సర్కారు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు నివేదించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సెక్షన్ 3 మార్గదర్శకాల మేరకు ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పునఃపంపిణీకి సంబంధించి ఢిల్లీలో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ శుక్రవారం కొనసాగింది. ఏపీ తరపున సీనియర్ అడ్వకేట్ జయదీప్‌గుప్తా వాదన లు కొనసాగిస్తూ.. పంట మార్పిడి, అ దనపు ప్రత్యామ్నాయ నీటి వనరుల ద్వారా కృష్ణా జలాల్లో మిగులు ఏర్పడుతుందన్న తెలంగాణ వాదనలను ఖండించారు.
తెలంగాణ లెక్కలు తప్పని కొట్టిపడేశారు. కృష్ణాడెల్టాకు చారిత్రక రక్షణల కింద ట్రిబ్యునల్ 181.2 టీఎంసీల నీటిని కేటాయించిందని గుర్తుచేశారు. డెల్టా కాల్వల ఆ ధునికీకరణ ఫలితంగా నీటివినియో గం 152.2 టీఎంసీలకే తగ్గిందని, తద్వారా మిగిలిన జలాలను పులిచింతల, రాజీవ్ భీమా లిఫ్ట్‌లకు ఉమ్మడి ఏపీ కేటాయించిందని, దానిని సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) ఆమోదించిందని వివరించారు.
కానీ, ప్రత్యామ్నాయ పంటలు, నీటి వనరుల అంచనా ప్రకారం డెల్టా కేటాయింపులను తెలంగాణ 130.1 టీఎంసీలకు తగ్గించడాన్ని ఖండించారు. పంటకా లం 150 రోజులుగా కాకుండా, కేవ లం 122 రోజులుగా మాత్రమే లెక్కగట్టిందని వివరించారు. తాజా సెషన్లో మూడు రోజుల విచారణ శుక్రవారంతో ముగిసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 23, 24, 25న నిర్వహించనున్నట్టు ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్ కుమార్ ప్రకటించారు.