హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): గోదావరి జలాల మళ్లింపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 ముందు తెలంగాణ అధికారులు వాదనలు వినిపించారు. రాష్ట్ర విభజన అనంతరం గోదావరి నుంచి పెన్నా బేసిన్‌కు భారీ స్థాయిలో నీటిని తరలించుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం భారీ ప్రాజెక్టులను చేపట్టిందని తెలిపారు. జీబీ లింక్ పేరిట భారీగా నీటిని బేసిన్‌కు అవతల ఉన్న పెన్నాకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నదని వాదించారు. తొలుత గోదావరి-పెన్నా డైవర్షన్ సీమ్ పేరుతో ప్రాజెక్టును ఏపీ చేపట్టిందని, ఆ తర్వాత దానిని వైఎస్ఆర్ పల్నాడు సీమ్‌గా మార్చిందని చెప్పారు. ఇప్పుడు పోలవరం నుంచి నీటిని తీసుకెళ్లేలా దానిని గోదావరి-బనకచర్ల (జీబీ) లింక్‌గా మార్చిందని పేరొన్నారు.
ప్రస్తుతం ఉన్న పోలవరం కుడి కాల్వ నుంచే రోజూ 1.5 టీఎంసీల నీటిని తరలించేలా ఆ కాల్వ సామర్థ్యాన్ని పెంచిందని, కానీ, గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్‌కు సమర్పించిన డీపీఆర్ ప్రకారం ఆ కాల్వ సామర్థ్యం కేవలం 10 వేల క్యూసెకులేనని వివరించారు. ప్రస్తుతం పెంచిన సామర్థ్యంతో పోలవరం నుంచి 90 రోజులపాటు 135 టీఎంసీల నీటిని బనకచర్లకు తరలించేలా జీబీ లింక్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్తున్నదని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు ద్వారా ఏపీ భారీ మొత్తంలో నీటిని తరలించుకుపోయే ప్రాజెక్టులను చేపట్టిందని తెలంగాణకు చెందిన అడ్వొకేట్లు ట్రిబ్యునల్ ముందు వాదించారు. పోలవరం నుంచి 80 టీఎంసీలు తీసుకునేలా పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సీమ్‌ను డిజైన్ చేశారని, ఆ నీళ్లతోపాటు ఇతర సోర్సుల ద్వారా తరలించే నీళ్లు కేడీఎస్ అవసరాలకు సరిపోతాయని వాదించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న ట్రిబ్యునల్.. 215 టీఎంసీల కన్నా ఎకువ నీటి అవసరాలున్నాయని ట్రిబ్యునల్ ముందు చూపించారని, కానీ, ట్రిబ్యునళ్లు కేవలం 151.2 టీఎంసీలే కేటాయించాయి కదా అని ప్రశ్నించింది. దానికి స్పందించిన తెలంగాణ అడ్వొకేట్.. ఆ అవసరాల కోసమే 80 టీఎంసీలను పట్టిసీమ ద్వారా తరలించేలా లిఫ్టును నిర్మించారని వివరించారు.
కేడీఎస్ అవసరాలు కేవలం 151.2 టీఎంసీలేనని, అందుకు అనుగుణంగా సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), టెక్నికల్ అడ్వైజరీ కమిటీలకు ఏపీ డీపీఆర్లనూ సమర్పించిందని గుర్తుచేశారు. పట్టిసీమ ద్వారా 80 టీఎంసీలను డైవర్ట్ చేయగా.. కేడీఎస్ నీటి అవసరాలు కేవలం 72 టీఎంసీలేనని స్పష్టం చేశారు. కాగా, శ్రీశైలంలో జల విద్యుత్తు ఉత్పత్తిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలంటూ ఏపీ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ ఉండటంతో.. మధ్యాహ్నం వరకే వాదనలు కొనసాగాయి. అయితే, సుప్రీంకోర్టుకు వెళ్లాక ఆ కేసును బెంచ్ మే 7వ తేదీకి వాయిదా వేసింది.
బుధవారం, గురువారం రెండు రోజులపాటు ట్రిబ్యునల్‌లో వాదనలు కొనసాగనున్నాయి. రాష్ట్రం తరఫున సీనియర్ అడ్వొకేట్ సీఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపించారు. అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్, ఇంటర్ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఎస్ఈ విజయ్‌కుమార్ తదితరులు వాదనలకు హాజరయ్యారు.