హైదరాబాద్, జనవరి10 (నమస్తే తెలంగాణ): నీటి వివాదాలను తెలంగాణతో చర్చించి పరిష్కరించుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. రాయలసీమకు నీళ్లివ్వడమే తమ లక్ష్యమని, ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మరోసారి పునరుద్ఘాటించారు. గోదావరి మిగులు జలాలను వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. శనివారం ఆయన అమరావతిలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వచ్చే రెండేండ్లు ఏపీలో నీటి కొరత తలెత్తకుండా చూసేందుకు ప్రణాళికలు రూపొందించామని, దేశంలోని అన్ని రాష్ర్టాలు తమను చూసి నేర్చుకునేలా ముందుకు సాగుతున్నామని వివరించారు.
నీటి విషయంలో గొడవలకు పోతే నష్టపోయేది తెలుగు ప్రజలేనని, మిగులు జలాలను సద్వినియోగం చేసుకుంటే రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉంటాయని మరోసారి సుద్దులు చెప్పారు. ‘రాయలసీమ లిఫ్ట్ పేరుతో కొందరు స్వార్ధ రాజకీయాలు చేస్తున్నారు. కానీ, రాయలసీమను రత్నాల సీమగా మార్చే సత్తా మాకున్నది. తెలంగాణతో మాకున్న సమస్యలు పరిషరించుకుంటాం. నీటి పంపకాలపై తెలంగాణతో సామరస్యంగా వ్యవహరిస్తాం. చర్చల ద్వారా తెలుగు ప్రజలందరికీ మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటాం. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం ద్వారా నీటి ఎద్దడిని శాశ్వతంగా నివారించవచ్చు. గోదావరి జలాలను రాయలసీమ, ఇతర కరువు ప్రాంతాలకు మళ్లించడమే మా ప్రధాన లక్ష్యం. నీటి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు’ అని చంద్రబాబు మరోసారి తేల్చిచెప్పారు.
ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం-నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టు నిర్మాణానికి రూ.58,700 కోట్లు సమకూర్చాలని ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రీ-బడ్జెట్ మీటింగ్లో ఆయన ప్రతిపాదనలు సమర్పించారు. ఏపీ చేపట్టిన పలు ప్రాజెక్టులకు ఆర్థిక చేయాలని, గ్రాంట్లను పెంచాలని కోరారు. ప్రధానంగా నదుల అనుసంధానానికి మరింత చేయూతనివ్వాలని, అందులో భాగంగా పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.