పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తం. కృష్ణా జలాలను రాయలసీమకు తరలించి తీరుతాం. పోలవరం నుంచి విశాఖకు, అక్కడి నుంచి వంశధారకు సైతం జలాలను మళ్లిస్తాం. మనవద్ద నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా వాడుకోవచ్చు. శ్రీశైలం నీళ్లను రాయలసీమకు తరలిస్తాం.
– రాయవరం పర్యటనలో చంద్రబాబునాయుడు
హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ నీటిహక్కులు, ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తేల్చి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయడంతోపాటు, కృష్ణా జలాలను రాయలసీమకు తరలించి తీరుతామని స్పష్టం చేశారు. ఆయన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో గురువారం పర్యటించారు. తెలంగాణ, ఏపీ మధ్య నీటి పంపకాలు, ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న వివాదాలపై స్పందించారు. తెలుగుజాతి మధ్య విద్వేషాలు పెంచే ప్రయత్నాలు చేయవద్దని సుద్దులు చెప్పారు. రాజకీయం కంటే తెలుగు ప్రజల బాధ్యత, ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు.
కొందరు నీటి విషయంలో కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల అవసరాలను తీర్చే ప్రాజెక్టులు శాస్త్రీయంగా ఉండాలని ఉద్బోధించారు. ‘నాకు గొడవలు ముఖ్యం కాదు, తెలుగుజాతి అభివృద్ధి ముఖ్యం. పొరుగు రాష్ట్రాలతో సమస్యలుంటే కూర్చుని చర్చించుకోవాలి. అంతేకానీ ప్రజల మధ్య గోడలు పెట్టేలా ప్రసంగాలు చేయకూడదు. అభివృద్ధి విషయంలో రెండు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగాలి. అప్పుడే తెలుగుజాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది’ అంటూ నీతివచనాలను వల్లించారు.
అదే సమయంలో ఏపీ ప్రయోజనాల కోసం రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. ‘సముద్రంలోకి వెళ్లే నీటిలో 300 టీఎంసీలను వాడుకుంటే కరువే ఉండదు. పట్టిసీమను కట్టినప్పుడు కూడా ఇలాగే రాద్ధాంతం చేశారు. కానీ 100 టీఎంసీలను తరలించి కృష్ణా డెల్టాకు అందించాం. పోలవరం పూర్తయితే ఈ ప్రాంతానికి నీటి సమస్యే ఉండబోదు. పోలవరం నుంచి విశాఖకు, అక్కడి నుంచి వంశధారకు సైతం జలాలను మళ్లిస్తాం. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడబోం. మనవద్ద నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా వాడుకోవచ్చు. శ్రీశైలంలో నీళ్లను రాయలసీమకు తరలిస్తాం. రతనాల సీమను చేస్తాం’ అంటూ తేల్చి చెప్పారు. పరోక్షంగా గోదావరి నుంచి పోలవరం- నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును, శ్రీశైలం నుంచి రాయలసీమ లిఫ్ట్‌ను యథాతథంగా కొనసాగిస్తామని కుండబద్దలు కొట్టారు.