నిర్మల్, మే 9 (నమస్తే తెలంగాణ): ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతన్నలు పండించిన వరి ధాన్యాన్ని గింజ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కొంటుండటం చూసి కొందరికి కండ్లు మండుతున్నాయి. తరుగు రూపంలో రైతులను దోచుకొంటున్నారని దుష్ప్రచారానికి తెరలేపారు. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు 11 కిలోలు తరుగు తీస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి విషం కక్కింది. మంగళవారం ఓ అవాస్తవ కథనాన్ని ప్రచురించింది. ఇది అవాస్తవమని రైతులు కొట్టిపారేస్తున్నారు. తెలంగాణ అన్నదాతను కేంద్రం వెన్నుపోటు పొడిస్తే.. రాష్ట్ర ప్రభుత్వమే కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నది. రైతన్న పండించిన లక్షల టన్నుల ధాన్యాన్ని కూడా ఊరూరా కొనుగోలు కేంద్రాలను తెరిచి గింజ లేకుండా కొనుగోలు చేస్తున్నది. తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని స్వయంగా సీఎం కేసీఆరే ప్రకటించారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రంలో క్వింటాలుకు 11 కిలోలు తరుగు పేరిట తీసుకొంటున్నారని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. వాస్తవం వేరేలా ఉన్నది. క్వింటాలుకు కేవలం 2.5 కిలోల ధాన్యాన్ని తరుగు పేరిట తీసుకొనేందుకు తామే అంగీకరించామని, ఇందులో కేంద్రా ల నిర్వాహకులకు ఎలాంటి ప్రమేయం లేదని రైతులే స్పష్టం చేశారు. కొంతమంది కాంగ్రెస్, బీజేపీ, ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకే ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని రైతులు మండిపడుతున్నారు.
అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోవడంతో తేమ శాతం ఎక్కువగా వస్తుండటం వల్ల రెండున్నర కిలోల వరకు తరుగు తీసేందుకు అంగీకరించామని వెల్లడించారు. ప్యాడీ క్లీనర్ల ద్వారా ధాన్యాన్ని శుభ్రం చేసి ఇస్తే ఆ రెండున్నర కిలోల తరుగు కూడా తీసుకోకుండా కొనుగోలు చేయడానికి నిర్వాహకులు సిద్ధంగా ఉన్నారని, కానీ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని పట్టుబడుతుండటంతో ఆ రెండు కిలోల తరుగు తీస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో పంటనంతా కొనుగోలు చేస్తుండగా, కాంగ్రెస్, బీజేపీ తప్పుడు ఆందోళనలు సృష్టిస్తుండటం సమంజసం కాదని మండిపడుతున్నారు.
ఆయా పార్టీల కార్యకర్తలతో ఆందోళన చేయించి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. క్వింటాలుకు 11 కిలోల తరుగు తీస్తున్నారంటూ ఆందోళన చేపట్టి ఎస్ఐ కాళ్లు పట్టుకున్న తర్లపాడు రైతు సార్ల నర్సయ్య తన ధాన్యాన్ని కేంద్రంలో ఇప్పటికే విక్రయించాడు. ఈ నెల 4న 204 బస్తాలు (96 క్వింటాళ్లు), 7న 72 బస్తాల (28.80 క్వింటాళ్లు) విక్రయించాడు. నర్సయ్య వద్ద 40 కిలోల బస్తాకు.. బస్తా బరువు కిలో పోను ఒక కిలో మాత్రమే తరుగు తీశారు. క్వింటాలుకు 2.5 కిలోల ధాన్యాన్ని తరుగు రూపంలో తీసుకున్నారు. వాస్తవం ఇలా ఉంటే, క్వింటాలుకు 11 కిలోల తరుగు తీసుకొంటున్నారంటూ రాద్ధాంతం చేసి రోడ్డెక్కారు. నర్సయ్య కాంగ్రెస్ పార్టీ నాయకుడని, పార్టీ పెద్దల ప్రోద్బలంతోనే ఆందోళన చేపట్టారని స్థానికులు చెప్తున్నారు.
అకాల వర్షాల కారణంగా తడిసిన వరి ధాన్యాన్ని కూడా మద్దతు ధరతో కొంటామని సీఎం కేసీఆర్ చెప్పిన్రు. చెప్పినట్టుగానే కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొంటున్నరు. నా పొలంలో పండిన 215 సంచుల ధాన్యాన్ని ఇక్కడి కేంద్రంలోనే అమ్ముకున్న. క్వింటాలుకు 2.5 కిలోల తరుగు తీసుకున్నరు. తప్ప, తాలు తీయకుండా విక్రయించడం వల్ల రైతులకు సమయం ఆదా అవుతున్నది. ప్రతిపక్షాలు రైతులతో రాజకీయాలు చేయడం మానుకోవాలి. రైతులకు మొదటి నుంచీ సీఎం కేసీఆర్ అండగా ఉన్నరు.
-ఆకుల రాజేశ్వర్, తర్లపాడు గ్రామం, ఖానాపూర్ మండలం
మాది ఖానాపూర్ మండలం తర్లపాడు. నాకు ఐదెకరాల పొలం ఉన్నది. మూడెకరాల్లో 140 సంచుల దిగుబడి వచ్చింది. ఈ నెల 4న అమ్మిన. మిగతా రెండెకరాల్లో వచ్చిన దిగుబడిని అమ్మేందుకు వచ్చిన. ఇక్కడ 40 కిలోల బస్తాను తూకం వేస్తున్నారు. బస్తా బరువు పోను అదనంగా కిలో తరుగు తీస్తున్నారు. క్వింటాలుకు 2.5 కిలోల ధాన్యాన్ని తరుగు కింద ఇస్తున్నం. అంతేకానీ క్వింటాలుకు 11 కిలోల తరుగు తీసుకొంటున్నారనడం పూర్తిగా అవాస్తం.
-పీ మల్లేశ్, తర్లపాడు (ఖానాపూర్)
కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తర్వాత రెండు లోడ్ల ధాన్యాన్ని రైతుల నుంచి ఎలాంటి తరుగు తీసుకోకుండా మిల్లులకు పంపినం. వీటిని పరిశీలించిన మిల్లర్లు.. ధాన్యంలో తప్ప, తాలు ఎక్కువగా ఉన్నదని, ఇలాగైతే ప్రభుత్వానికి తాము క్వింటాలుకు 68 కిలోల బియ్యాన్ని ఇవ్వలేమని చెప్పారు. రైతుల వద్ద నుంచి 3 కిలోల ధాన్యాన్ని తరుగు రూపంలో తీసుకొని పంపించాలని చెప్పారు. రైతులకు ఇదే విషయాన్ని చెప్పినం. రైతులు తరుగు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.
-ఆశన్న, పీఏసీఎస్ కార్యదరి(ఖానాపూర్)