హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాల మధ్య అవగాహన కుదరలేదు. పొత్తు కోసం కాంగ్రెస్ పార్టీ కనీస ప్రయత్నం చేయలేదని తేటతెల్లమైంది. మిత్రపక్షాలైన సీపీ ఐ, టీజేఎస్ (తెలంగాణ జనసమితి), సీపీఎంను కాంగ్రెస్ విస్మరించిన వైనం బట్టబయలైంది. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఆయా పార్టీల నేతలు ఇతర పార్టీలతో కలిసి నామినేషన్లు దాఖలు చేశారు.
మిత్రపక్షాలతోపాటు కాంగ్రెస్ పార్టీలో ఆశావహుల మధ్య సమన్వయం చేయడానికి ఏర్పాటుచేసిన స్క్రీనింగ్ కమిటీ కేవలం అలంకార ప్రాయంగా మారింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఒక్కో స్థానం నుంచి ఇద్దరు లేదా ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. స్క్రీనింగ్ కమిటీ ప్రమేయం లేకుండానే కొన్ని జిల్లాల్లోని నేతలు ఎవరికి వారేగా అభ్యర్థులను ప్రకటించారు. దీంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ఎవరికీ స్క్రీనింగ్ కమిటీ బీఫామ్ ఇస్తుందో అనే అనుమానాలు సొంత పార్టీలోనూ నెలకొన్నాయి.
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటుచేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే అభ్యర్థుల ఎంపిక, బీఫామ్‌లను అందజేయాలని టీపీసీసీ నిర్ణయించింది. కానీ నల్లగొండ పార్లమెంటు పరిధిలో మాత్రం అందుకు విరుద్ధంగా నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభ్యర్థులను ప్రకటించారు. ఇది జరిగిన 48 గంటల్లోనే డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాశ్‌నేత జిల్లా ఎన్నికల అధికారికి ఏ సర్టిఫికెట్తో నామినేషన్ దాఖలు చేశారు. దీని ప్రకారం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చే అధికారం తనకే ఉంటుందని వెల్లడించారు.
ఈ జిల్లాలో కోమటిరెడ్డికి, డీసీసీ అధ్యక్షుడికి మధ్య వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో పున్నా కైలాశ్ నామినేషన్ చర్చనీయాంశంగా మారింది. కోమటిరెడ్డి ప్రకటించిన అభ్యర్థులకు డీసీసీ బీఫామ్ ఇస్తుందా? లేదా? అనే సందిగ్ధం నెలకొన్నది. అదే విధంగా సంగారెడ్డి మున్సిపాలిటీ అభ్యర్థులను జగ్గారెడ్డి ప్రకటించారు. వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు మిత్రపక్షాల నేతలతో చర్చించకుండానే నామినేషన్లు వేయించడంతో ఆయా నియోజకవర్గాల్లో సీపీఐ, సీపీఎం ఇతర పార్టీలతో సర్దుబాటు చేసుకొని నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.
నామినేషన్ల పరిశీలన తర్వాతే బీ ఫామ్ ఇస్తామని కాంగ్రెస్ నాయకత్వం స్పష్టం చేయడంతో కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరికి టికెట్‌పై స్పష్టత ఇవ్వగా, మరికొందరికి రాకపోవడంపై గుర్రుగా ఉన్నారు. అర్హులైన తమకు కాదని వేరే వారికి అవకాశం ఇస్తే ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు. దీంతో రాబోయే 3 రోజులు టికెట్ రాని అసంతృప్తులను బుజ్జగించడంతో పాటు మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు ఆ పార్టీ నేతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది.
కాంగ్రెస్‌తో చర్చలు కొలిక్కి రాకపోవడంతో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 13 వార్డుల్లో సీపీఐ నామినేషన్లు దాఖలు చేసినట్టు సీపీఐ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి బీ విజయసారథి తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో హైదరాబాద్‌లోని అర్పనపల్లి, మహబూబాబాద్‌లో పలు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మురళీనాయక్, ఎంపీ బలరాంనాయక్, డీసీసీ అధ్యక్షురాలు భూక్యా ఉమాభరత్ చందర్రెడ్డితో సీపీఐ చర్చలు జరిపిందని చెప్పారు. అయినా ఇంకా చర్చలు కొలికి రాలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో గత అన్ని ఎన్నికల్లో సీపీఐ కలిసి పనిచేసిందని.. ఈ ప్రాంతంలో మురళీనాయక్, బలరాంనాయక్ గెలుపునకు తామంతా కృషి చేసినట్టు తెలిపారు. తాము అడిగిన డబుల్ డిజిట్ వార్డుల్లో అవకాశం ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకు రావాలని కోరారు.

రామకృష్ణాపూర్, జనవరి 31: మంచిర్యా ల జిల్లా చెన్నూరు నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు.. సీపీఐ భారీ షా క్ ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేయాలన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ వ్యూహం ఫలించింది. శనివారం రామకృష్ణాపూర్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షు డు సీతారామయ్య, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శంకర్, జిల్లా కార్యదర్శి లక్ష్మణ్‌తో కలిసి మాట్లాడారు. బీఆర్ఎస్, సీపీఐ కలిసి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పొత్తు కుదిరిందని వెల్లడించారు. భవిష్యత్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై నిరసనలు, సింగరేణి కార్మికుల శ్రేయస్సు, పరిరక్షణ కోసం కలిసి పనిచేయనున్నట్టు వెల్లడించారు. అభివృద్ధికి కృషి చేయనున్నట్టు తెలిపారు.