సిటీబ్యూరో/మల్కాజిగిరి, జూలై 27 (నమస్తే తెలంగాణ) : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దోమల బెడదతో కంటిమీద కునుకు లేకుండా జనాలు అల్లాడిపోతుంటే..దానికి పరిష్కారం చూపాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కాలనీలు, బస్తీల్లో దోమల నియంత్రణలో వినియోగించాల్సిన ఫాగింగ్ యంత్రాలను సర్ ప్రచార రథంగా మార్చేశారు. అంతేకాకుండా ఎంటమాలజీ సిబ్బంది సర్ విధులకు మాత్రమే పరిమితమయ్యారు. దీంతో ఫాగింగ్ ప్రక్రియ నిలిచిపోవడంతో దోమల మోత తీవ్రమైనది.
మల్కాజిగిరి, మౌలాలి సర్కిల్స్ పరిధిలో కొంతకాలంగా ఫాగింగ్ చేపట్టడం లేదని ఫిర్యాదులు అధికమయ్యాయి. సర్ విధుల నేపథ్యంలో ఫాగింగ్ పనులు నిర్వహించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. దీనికి తోడు ఫాగింగ్ వాహనాలు కాలనీల్లో ఎన్యూమరేషన్, సర్, ఓటు హక్కు, తదితర అంశాలపై మైకులతో ప్రచారం చేస్తున్నాయి. అంటే ఫాగింగ్ చేయాల్సిన వాహనాలు ప్రచారానికి వాడుతున్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు మున్సిపల్ సర్కిల్స్‌లో విధులు నిర్వర్తించే ఎంటమాలజీ సిబ్బంది సర్ విధులు నిర్వర్తిస్తున్నారు.
దీంతో కొంతకాలంగా ఫాగింగ్ చేపట్టడంలేదు. దీంతో కాలనీల్లో దోమల వ్యాప్తి పెరుగుతుంది. వర్షాలు కురుస్తుండటంతో ఫాగింగ్ లేక పోవడంతో దోమల బెడద తప్పడంలేదు. సర్కిల్ పరిధిలోని వార్డుల వారీగా విధులు నిర్వర్తిస్తున్నారు. సర్కిల్స్‌లో వార్డులకు 18 మంది సిబ్బంది పని చేయాల్సి ఉండగా చాలా ప్రాంతాల్లో సిబ్బంది తక్కువగానే ఉన్నారు. అసలే అరకొర సిబ్బందితో పనిచేసే ఫాగింగ్ విభాగంలోని సిబ్బందిని సర్ ప్రక్రియలో భాగస్వామ్యం చేశారు. దీంతో ఫాగింగ్ ప్రక్రియ ప్రశ్నర్థకమైనది. మౌలాలి సర్కిల్లో 57 మంది, మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో 72 మంది ఫాగింగ్ సిబ్బంది ఉండగా, దాదాపుగా అందరు సర్ విధులు చేపడుతున్నారు. అంటే ఎంఎంసీ పరిధిలో 14 సర్కిల్స్ ఉండగా వందల సంఖ్యలో సిబ్బంది సర్ విధులు చేపడుతున్నారు.
గతంలో మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో ఫాగింగ్ విభాగంలో అక్రమాలు వెలుగుచూడటం, విధులకు గైర్హాజరుతో 12 మందిని సస్పెండ్ చేశారు. అయితే డీజిల్ కుంభకోణం బయటకు రావడంతో అవినీతి జరిగినట్లు తెలడంతో పలువురిపై వేటు వేశారు. అయితే విచిత్రంగా మళ్లీ అందులో కొంతమందిని మళ్లీ విధుల్లోకి తీసుకొని, విధులు నిర్వర్తిస్తుండటం చర్చకు దారి తీస్తుంది. ఫాగింగ్‌లో జరుగుతున్న పనితీరు, పనుల పరిశీలనపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఫాగింగ్ పనులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.