ముంబై, జూలై 27 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు భారీగా క్షీణించాయి. దీంతో సోమవారం ట్రేడింగ్‌లో సూచీలు పెద్ద ఎత్తున పుంజుకున్నాయి. మదుపర్లు పెట్టుబడులకు పెద్దపీట వేయడంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 776.01 పాయింట్లు లేదా 1.02 శాతం ఎగిసి 76,835.78 వద్ద ముగిసింది. ఒకానొక దశలోనైతే 841.74 పాయింట్లు ఎగబాకింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 228.50 పాయింట్లు లేదా 0.96 శాతం బలపడి 23,995.95 వద్ద స్థిరపడింది. దీంతో 5 రోజుల నష్టాలకు తెరపడినైట్టెంది. గత వారం మొత్తంగా భారతీయ ఈక్విటీలు నష్టాలకే పరిమితమైన విషయం తెలిసిందే. సెన్సెక్స్ 2,092, నిఫ్టీ 567 పాయింట్లు పతనమైయ్యాయి.
ఎటర్నల్ షేర్ విలువ అత్యధికంగా 5.70 శాతం పెరిగింది. ఇండిగో, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లూ మదుపర్లను ఆకట్టుకున్నాయి. రంగాలవారీగా.. ఐటీ, రియల్టీ, సేవలు, ఆటో తదితర షేర్లు లాభాలను అందిపుచ్చుకున్నాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీ 1.65 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 1.71 శాతం చొప్పున పెరిగాయి. ఇక ఆసియా ప్రధాన మార్కెట్లలో జపాన్, దక్షిణ కొరియా, చైనా, హాంకాంగ్ సూచీలూ పరుగులు పెట్టాయి. ఇది కూడా భారతీయ ఈక్విటీలకు కలిసొచ్చింది. ఐరోపా, అమెరికా మార్కెట్లూ లాభాల్లోనే కదలాడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ దాడులు, ప్రతిదాడులు ఆగడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. సోమవారం ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ రేటు ఏకంగా 9.40 శాతం దిగజారి 87.64 డాలర్లకు వచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్నాయని గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో అక్కడ ముడి చమురు, గ్యాస్ ఉత్పత్తికి అంతరాయం కలుగుతున్నది. ఈ నేపథ్యంలోనే గతంలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడంతో బ్యారెల్ ధర 125 డాలర్లను దాటేసిన విషయం తెలిసిందే. ఇటీవల కూడా యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో క్రూడాయిల్ రేట్లూ పరుగులు పెట్టాయి. అయితే ఇప్పుడు దిగొస్తున్నాయి. ఈ క్రమంలో పశ్చిమాసియాలో శాంతి నెలకొంటే ధరలు ఇంకా పడిపోతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగియడంతో ఒక్కరోజే మదుపర్ల సంపద లక్షల కోట్ల రూపాయల్లో పెరిగింది. బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ సోమవారం ట్రేడింగ్‌లో రూ.5,10, 561.8 కోట్లు ఎగబాకింది. దీంతో మొత్తం మార్కెట్ విలువ రూ.4,80, 80,037.04 కోట్ల (5 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో 2,776 షేర్లు లాభపడగా, 1,580 షేర్లు నష్టపోయాయి. 202 షేర్లు యథాతథంగా ఉన్నాయి.
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య సైనిక దాడుల్లో విరామం.. గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ రేట్లను తగ్గుముఖం పట్టించింది. ఫలితంగా ఇన్నాళ్లూ ముడి చమురు దిగుమతులు భారమైపోయాయన్న ఆందోళనలు, ద్రవ్యోల్బణం భయాలు ఒక్కసారిగా తొలగిపోయాయి. దీంతో మార్కెట్ సెంటిమెంట్ బలపడింది. ఇది భారతీయ స్టాక్ మార్కెట్లలో ర్యాలీకి కారణమైంది. దీర్ఘకాలిక బాండ్ రాబడుల్లో క్షీణత సైతం మదుపర్ల పెట్టుబడులను స్టాక్స్ వైపునకు మళ్లించింది.
వరుసగా 5 రోజులపాటు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలకే పరిమితమయ్యాయి. ఎట్టకేలకు సూచీలు లాభాలను సంతరించుకున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో తగ్గిన ఉద్రిక్తతలకు అనుగుణంగా మార్కెట్లో క్రూడాయిల్ రేట్లు దిగొచ్చాయి. దీంతో ఇన్వెస్టర్లు అమ్మకాల ఒత్తిడి నుంచి బయటపడి తిరిగి కొనుగోలుకు ప్రాధాన్యతనిచ్చారు. తగ్గే ముడి చమురు ధరలు.. దేశంలో ద్రవ్యోల్బణానికి కళ్లెం వేస్తుందని, ఆర్థిక వ్యవస్థకు నూతనోత్సాహాన్ని అందించగలదన్న విశ్వాసం మదుపర్లలో కనిపించింది.
మిడిల్ ఈస్ట్‌లో చోటుచేసుకున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు తాత్కాలికంగా శాంతించడం.. మదుపర్ల సెంటిమెంట్‌ను బలపర్చింది. ముడి చమురు ధరల్లో నమోదైన పతనం.. ఈక్విటీ పరుగుకు ఇంధనంగా మారింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను కొన్ని రంగాలకు చెందిన పలు కంపెనీలు ప్రకటించిన ఆర్థిక ఫలితాలు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. దీంతో ఇన్వెస్టర్లు సెల్లింగ్ ప్రెషర్ నుంచి బయ్యింగ్ మోడ్‌లోకి వచ్చారు.