తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఓ అక్క సాహసమే చేసింది. తాను వెళ్లాల్సిన రైల్వే అండర్‌పాస్ వర్షానికి నీటమునిగినా ఎత్తయిన గోడను ఎక్కి రాఖీ తీసుకెళ్లింది. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మానవపాడు చుట్టుపక్కల ఉన్న వాగులు, వంకలు పొంగిపొర్లాయి. శనివారం రాఖీ పండుగ కావడంతో జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన సరిత మానవపాడులోని తన సోదరుడు మహేశ్‌కు రాఖీ కట్టేందుకు వచ్చింది. మానవపాడు సమీపంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద 6 అడుగుల మేర వర్షపు నీళ్లు నిలిచాయి. ఊళ్లోకి వెళ్లాలంటే తప్పనిసరిగా రోడ్డు దాటాల్సిందే.. గత్యంతరంలేని పరిస్థితుల్లో.. 20 అడుగుల ఎత్తులో ఉన్న అండర్‌పాస్ గోడమీదుగా ప్రమాదకరంగా నడుచుకుంటూ మానవపాడుకు చేరుకొని తమ్ముడికి రాఖీ కట్టింది.
తండ్రి సమాధికి రాఖీ కట్టి అనుబంధాన్ని గుర్తుచేసుకున్నది ఓ ఆడబిడ్డ. జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం భీమ్రాజ్పల్లికి చెందిన బొమ్మెన మాధవి చిన్ననాటి నుంచి అన్నతోపాటు తండ్రి రాజయ్యకు కూడా రాఖీ కట్టేది. రెండేండ్ల క్రితం తండ్రి హఠాన్మరణం చెందగా, మాధవి మాత్రం రాఖీ కట్టే సంప్రదాయాన్ని మాత్రం వదులుకోలేకపోయింది. మాధవి అన్న విదేశంలో ఉన్నప్పటికీ.. తనతల్లిగారి స్వగ్రామమైన పెద్దపెల్లి జిల్లా రాంపల్లి గ్రామానికి వెళ్లి తండ్రి సమాధికి రాఖీ కట్టింది. నిరుడు కూడా ఇదేవిధంగా చేసింది.