హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ అవరణలో బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ‘మీకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుంది’ అని రాజగోపాల్‌రెడ్డిని కేటీఆర్ అడిగారు. దీంతో ‘మీ లాగానే మా మీద కూడా ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతున్నది’ అని రాజగోపాల్‌రెడ్డి జవాబిచ్చారు. ‘ఫ్యామిలీ పాలన కాదు, మంచిగా పని చేస్తే కీర్తి, ప్రతిష్ఠలు వస్తాయి’ అని కేటీఆ ర్ చెప్పారు.
‘ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తుందా? కొడుకు సంకీర్త్ పోటీ చేస్తాడా?’ అని కేటీఆర్ అడగడంతో దయచేసి తనను కాంట్రవర్సీలోకి లాగొద్దని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. తొలుత మీడియా చిట్‌చాట్‌లో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. తనకు హోం మంత్రి కావాలని ఉన్నదని చెప్పడం విశేషం. నల్లగొండ ఎంపీ స్థానానికి తమ కుటుంబం నుంచి ఎవరూ పోటీలో ఉండరని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థిని గెలిపిస్తామని, బీసీలకు ఇచ్చినా, ఎవరికి ఇచ్చినా గెలిపిస్తామని చెప్పారు.