మంచిర్యాల, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా ఆర్టీవో కార్యాలయంలో వసూళ్ల దందా మూడు పూలు, ఆరు కాయలుగా సాగుతున్నది. కార్యాలయంలో ఏ ఫైల్ కదలాలన్నా కాసులివ్వాల్సిందేనన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీవో కార్యాలయంలో పని చేసే ఓ హోం గార్డు లంచం అడిగాడని, ఇవ్వక పోవడంతో తనపై దాడి చేశారంటూ బాధితుడు మీడియాను ఆశ్రయిం చాడు. బాధితుడి కథనం ప్రకారం.. “శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ముందు ఆదివారం ఆర్టీవో అధికారులు వాహనాల తనిఖీ నిర్వహిస్తూ ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ కారును ఆపారు. ఆన్లైన్లో చెక్ చేసి రూ.2 లక్షలుల ఫైన్ ఉంది.. కట్టాలని బాధితుడి(కారు యాజమాని)తో చెప్పారు.
ఈ క్రమంలో తనకు తెలిసిన ఓ స్నేహితుడి ద్వారా ఆర్టీవో అధికారులతో మాట్లాడించిన బాధితుడు, అక్కడి నుంచి కారును విడిపించుకొని వెళ్లిపోయాడు. కారును వదిలేశాక ఓ గంటకు ఆర్టీవో కార్యాలయంలో పని చేసే ఓ హోం గార్డు.. కారు ఓనర్‌ను గుడిపేట సమీపంలోని ఓ పెట్రోల్ బంక్ సమీపంలో అడ్డుకొని, ‘బండిని నేనే విడిపించా.. రూ.20 వేలు ఇవ్వాలి.’ అంటూ డిమాండ్ చేశాడు. దానికి కారు యాజమాని నువ్వు బండి విడిపించలేదు. మా స్నేహితుడు చెబితే విడిచిపెట్టారంటూ సమాధానమిచ్చాడు.
ఈ క్రమంలో ఇది ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారితీసిందని, హోంగార్డు తనను కొట్టారని, గొడవ పెద్దది అవ్వడంతో, అందరూ గుమిగూడడంతో ఇద్దరం అక్కడి నుంచి వెళ్లిపోయామని, కానీ హోం గార్డు ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు’ అంటూ బాధితుడు చెబుతున్నాడు. ఈ విషయమై ఆర్టీవో గోపీకృష్ణను వివరణ కోరగా.. అలాంటిది ఏమీ లేదన్నారు. ఎలాంటి గొడవ జరుగలేదని, బాధితుడు రేపు మా కార్యాలయానికి వచ్చి లెటర్ రాసిస్తానని తనతో ఫోన్లో చెప్పారని తెలిపారు. ఇక ఆర్టీవోకు మీడియా ఫోన్ చేశాక.. తెలిసిన వ్యక్తులతో బాధితుడిని సంప్రదించిన ఆర్టీవో కార్యాలయంలో పనిచేసే హోంగార్డు, అతన్ని ముల్కల్ల శివారు ప్రాంతంలోకి తీసుకెళ్లి.. డబ్బులు అడగలేదని, గొడవ జరగలేదని ఆర్టీవో కార్యాలయానికి వచ్చి రాసివ్వాలంటూ బతిమిలాడినట్లు తెలిసింది.
విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లేలోపు సదరు హోం గార్డు, బాధితుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గతంలో ఆర్టీవో కార్యాలయంలో పేకాట ఆడుతూ మీడియాకు దొరికిన కేసులో ఇదే హోంగార్డు సస్పెండ్ అవ్వడంతో పాటు వేరే ప్రాంతానికి బదిలీ అయ్యారు. కానీ, తిరిగి పోస్టింగ్ తెచ్చుకొని ఆర్టీవో కార్యాలయాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా వసూళ్ల దందాకు ఆయన పాల్పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీడియా ఫోన్ చేశాక బాధితుడిని కలిసి బతిలాడం చర్చనీయాంశంగా మారింది.