హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ) : ‘జబ్బకు జెండా చేతుల జెండా జాతర పోదమా.. గులాబీ జాతర పోదమా..’, ‘మన అన్న కేసీఆరూ రామక.. ఎంత మంచిపనులు జేసే రామక..’ అన్నపాటలే కాక మరెన్నో ఉత్తేజితమైన ఆటాపాటలతో ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ అలరించింది. ఎర్రటి ఎండలో ఎల్కతుర్తిని ఎగురవేసి ధూంధాం చేశాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా తెలంగాణే కేసీఆర్‌గా, కేసీఆరే తెలంగాణగా నడిచొచ్చిన దారిని, మలుపుతిప్పిన మార్గాలను ఆటపాటలతో కళాకారులు ప్రజలను ఆలోచింపజేశారు. మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారథి మాజీ చైర్మన్ రసమయి బాలకిషన్ సారథ్యంలోని కళాకారుల బృందం నిర్వహించిన తెలంగాణ ధూంధాం లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలకు ఎండతీవ్రత తీవ్రత తెలియకుండా చేసింది.
ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఆటపాటలు సభాప్రాంగణానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చేదాకా నాలుగు గంటలపాటు నిర్విరామంగా కొనసాగాయి. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభాప్రాంగణానికి చేరుకోగానే ఆలపించిన ‘గులాబీ జెండాకు గుండెబలం అన్నా కేటీఆరూ, జై రామన్నా.. జై జై రామన్నా’ అంటూ కళాకారులు పాట అందుకోగానే సభాప్రాంగణం యువత కేరింతలతో దద్దరిల్లిపోయింది. తెలంగాణ ఆటాపాటలతో పరుగులు పెట్టే తెలంగాణ జీవధార అని ఎల్కతుర్తి సభ మరోసారి నిరూపించింది.