 
                                                            కాంగ్రెసోళ్లు చెయ్యి సూపిచ్చి ఓటెయ్యమంటరు. అటెన్క నెత్తిన చెయ్యి పెడ్తరు. మళ్ల కంటికి కూడ కనపడరు. చేయి గుర్తోళ్లయినా, పువ్వు గుర్తోళ్లయినా మాకు చేసిందేమీ లేదు. ఓట్లప్పుడే కనబడ్తరు. ఈళ్లందరు ఎందుకొస్తున్నరు? ఇండ్లు కూలుస్తందుకు వస్తున్నరా? కరెంటు పోగొడ్తందుకు వస్తున్నరా? పదేండ్లు కేసీఆర్ ఏం చేసిండు అని అడుగుతున్నరు. మరి అంతకుముందు 60 ఏండ్లు అధికారంల ఉన్న కాంగ్రెసోళ్లు ఏం చేసిండ్రు? ఇప్పుడు రెండేండ్లసంది ఏం చేసిండ్రు? పింఛన్లు 4వేలకు పెంచిండ్రా? ఆడబిడ్డలకు చీరెలిచ్చిండ్రా? పదేండ్లసంది పోని కరెంటు ఇప్పుడెందుకు పోతున్నది? దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టుంది మీ పాలన!
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెసోళ్లు చెయ్యి (Congress) సూపిచ్చి ఓటెయ్యమంటరు. అటెంక నెత్తిన చెయ్యివెడ్తరు. ఓట్లేయించుకొని అవతల పడ్తరు. మళ్ల కంటికి కూడ కనపడరు. చేయి గుర్తోళ్లయినా, పువ్వు గుర్తోళ్లయినా మాకు చేసిందేమీ లేదు. ఓట్లప్పుడే కనవడ్తరు. ఈళ్లందరు ఎందుకొస్తున్నరు? ఇండ్లు కూలుస్తందుకు వస్తుండ్రా? కరెంటు పోగొడ్తందుకు వస్తున్నరా? మోరీలు నింపేటందుకు వస్తున్నరా? పదేండ్లు కేసీఆర్ (KCR) ఏం చేసిండు అని అడుగుతుండ్రు. మరి అంతకుముందు 60 ఏండ్లున్న కాంగ్రెసోళ్లు ఏం చేసిండ్రు? ఇప్పుడు ఏం చేస్తుండ్రు? పింఛన్లు నాలుగు వేలకు పెంచుత అన్నరు పెంచిండ్రా? ఆడబిడ్డలకు చీరెల్చిర్రా? దినాం కరెంటు పోతున్నది.
పదేండ్ల సంది కరెంటు పోయిందా? మీరొచ్చినంక ఎందుకు పోతున్నది? దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టుంది మీ పాలన’ అంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ (Jubilee Hills By-Election) పరిధిలోని ఎర్రగడ్డకు చెందిన ఓ వృద్ధురాలు మంత్రి జూపల్లి కృష్ణారావును నిలదీసింది. చెయ్యి గుర్తుకు ఓటేయాలని ఆమెను కోరగా, ఇప్పుడు చెయ్యి గుర్తుకు ఓటేయమంటారని, ఆ తర్వాత నెత్తిమీద చెయ్యిపెడతారని, కంటికి కూడా కనపడరని మండిపడ్డారు. ఉచిత కరెంటు అన్నారని, రూ.4వేల పింఛను అన్నారని, ఎవరికి ఇచ్చారని ఆమె నిలదీయగానే మంత్రి జూపల్లి అక్కడి నుంచి జారుకున్నారు.
కాంగ్రెస్ మంత్రులు, నేతలను జూబ్లీహిల్స్ ప్రజలు అడుగడుగునా నిలదీస్తున్నారు. ఎక్కడికెళ్లినా అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో ఏం చేశారని ఓట్లడగటానికి వస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఓట్లడిగి అవతల పడతారని, మళ్లీ కంటికి కనిపించరంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని మండిపడుతున్నారు. ఇటీవల ఎర్రగడ్డ రైతు బజారులో ఎరువులు లేక రైతులు ఆగమవుతున్నారని మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్‌ను మహిళలు నిలదీశారు. పదేండ్లలో ఎన్నడూ కరెంటు కోతలు లేవని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రోజుకు మూడు నాలుగు సార్లు కరెంట్ కట్ చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ఇండ్లు కూల్చడానికి, మోరీలు నింపడానికే వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయా కాలనీల్లో తిరగడానికి కాంగ్రెస్ నేతలు వెనకడుగేస్తున్నారు. ఎక్కడికెళ్లినా ప్రజల నుంచి అడుగడుగునా వ్యతిరేకత వస్తుండటంతో ప్రచారం చేసేందుకు జంకుతున్నారు. నామమాత్రంగా ప్రచారం చేస్తూ వెళ్లిపోతున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి బాగా పెరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. అందుకే ఆ పార్టీ ఆపద మొక్కులు మొక్కుతున్నదని ఎక్స్ ద్వారా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థి డిపాజిట్ కోల్పోయేలా ప్రజలు చేసినప్పుడు మాత్రమే 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 వాగ్దానాలను ఆ పార్టీ అమలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వంలోకి వచ్చిన రెండేండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహిస్తున్నదని తెలిపారు.
అందుకే పూర్తిగా దిగజారిన పార్టీ పరువును కాపాడుకోవడానికి అడ్డగోలు ప్రయత్నాలు చేస్తున్నదని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం సినీ కార్మికులకు అడ్డగోలు వాగ్దానాలు చేయడం, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను క్యాబినెట్లోకి తీసుకోవడం, మంత్రులు గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ వీధుల్లో హడావుడిగా తిరగడం వంటివి చేస్తున్నారని, ఆ పార్టీ తీవ్ర ఒత్తిడిలో ఉందనడానికి ఇది నిలువెత్తు నిదర్శనమని స్పష్టం చేశారు. కాంగ్రెస్, ఆ పార్టీ నాయకత్వానికి గుణపాఠం చెప్పడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికే సరైన వేదిక అని, ఈ ఎన్నికలో జూబ్లీహిల్స్ ఓటర్లు ఆ పార్టీకి గట్టిగా గుణపాఠం చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
‘రేవంత్‌రెడ్డి చెప్పినట్టు నాలుగు వేలకు పింఛన్లు పెంచారా? రెండేండ్లలో ఏం చేశారు? ఓట్లప్పుడు వచ్చుడు, మాటలు చెప్పుడు తప్ప ఏం చేస్తున్నరు? అంటూ ఓ పెద్దమ్మ (వృద్ధురాలు) సంధించే ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పండి?’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేస్తున్న మంత్రి జూపల్లిని వృద్ధురాలు నిలదీసిన వీడియాను కేటీఆర్ గురువారం తన పోస్ట్‌కు ట్యాగ్ చేశారు. రేవంత్ బాబా, 40 మంది అలీబాబా దొంగల ముఠాకు ఆ పెద్దమ్మ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ఎలాగూ లేదని, కనీసం ఆమె ఎదురుగా నిల్చునే ధైర్యం ఉన్నదా? అని నిలదీశారు. ‘ఇలాంటి పదునైన ప్రశ్నలకు సమాధానాలు రెడీ చేసుకొని జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి రండి. ఇది మీకు ఒక ఫ్రెండ్లీ సలహా’ అని సెటైర్ వేశారు. జూబ్లీహిల్స్ జనం కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. ప్రశ్నిస్తరు, నిలదీస్తరు, అవసరమైతే పరుగెత్తిస్తరు అంటూ తనదైన శైలిలో హెచ్చరించారు.
 
                            