కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ పట్ల ఉన్న కక్ష పతాకస్థాయికి చేరింది. తెలంగాణ అంటేనే పగబట్టినట్టుగా బుసలు కొడుతున్నది. ఒక్క పైసా ఇవ్వం.. ఒక్క ఫ్యాక్టరీ ఇవ్వం.. అసలు తెలంగాణను అభివృద్ధే కానియ్యం.. ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు విషయమై పార్లమెంట్లో సాక్షిగా విషం కక్కింది. ఒకేసారి ఇద్దరు కేంద్ర మంత్రులు లోక్‌సభలో తెలంగాణ ఆశలపై నీళ్లు చల్లుతూ రైల్ కోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు ఏర్పాటు కుదరదని తేల్చి చెప్పారు.
హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కక్ష పతాకస్థాయికి చేరింది. పగబట్టినట్టుగా బుసలు కొడుతున్నది. ఒక్క పైసా ఇవ్వం.. ఒక్క ఫ్యాక్టరీ ఇ వ్వం.. అసలు తెలంగాణను అభివృద్ధే కానియ్యం.. ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా వ్యవహరిస్తున్న ది. పసుపు బోర్డు తెస్తానని ప్రామిసరీ నోటు రాసిచ్చి ఓట్లేయించుకొన్న బీజేపీ.. ఇన్నాళ్లూ ఇగో.. అగో అని బొంకి ఇప్పుడు బోర్డు లేదు.. గీర్డు లేదు పోండి అని పార్లమెంటు సాక్షిగా విషం కక్కింది.
బుధవారం ఒకేరోజు లోక్‌సభలో ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణ ఆశలపై నీళ్లు చల్లారు. రైల్ కోచ్ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు ఏర్పాటు కుదరదని స్పష్టంచేశారు. తెలంగాణలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రతిపాదనేదీ తమ పరిశీలనలో లేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. లోక్‌సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు అడిగిన ప్రశ్నకు వైష్ణవ్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. ఇప్పుడున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీలు రోలింగ్ స్టాక్‌ల అవసరాన్ని తీర్చడానికి సరిపోతాయని, కొత్తగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయడంలేదని పేర్కొన్నారు.
ఎన్నిసార్లు కలిసినా…
రాష్ట్రానికి వివిధ సంస్థల ఏర్పాటు, పథకాల అమలుకు ప్రధాని, కేంద్ర మంత్రులు, కేంద్ర అధికారులకు సీఎం కేసీఆర్ సహా రాష్ట్ర మంత్రులు అనేక వినతిపత్రాలు ఇచ్చారు. లేఖలు రాశారు. రాష్ట్ర అధికారులూ కేంద్ర అధికారులకు ప్రజల ఆ కాంక్షలను వివరించారు. అయినా కేంద్రానికి చీమ కుట్టినట్టు కూడా లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ తన రాజకీయ అవసరాల కోసమే పనిచేస్తున్నదని తెలంగాణవాదులు మండిపడుతున్నారు.
కోచ్ ఫ్యాక్టరీ వచ్చేవరకు పోరాటం: నామ
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను అనుసరించి కేంద్ర ప్రభుత్వం కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చింది. నేడు అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం దీనిపై మాట మార్చడం పట్ల నామా నాగేశ్వర్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు నిరాకరించి వేలమంది యువత పొట్ట కొట్టేలా కేంద్రం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. దీనిని ఏర్పాటు చేసేంతవరకు కేంద్రంపై అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.
పసుపు బోర్డు ఇవ్వం..
తెలంగాణలో పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పాటిల్ లోక్‌సభలో బుధవారం తెలిపారు. బీఆర్ఎస్ ఎంపీలు బోర్లకుంట వెంకటేశ్, రంజిత్ రెడ్డి, మాలోత్ కవిత అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. పసుపు బోర్డుతో పాటుగా మరే ైస్పెస్ బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని స్పష్టంచేశారు. నిన్నటికి నిన్న హైదరాబాద్‌లో మెట్రో రైల్ రెండోదశ ప్రాజెక్టు ఇవ్వబోమని కేంద్రం తెగేసి చెప్పిన విషయం తెలిసిందే. విభజన హామీ అయిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఏర్పాటుచేయబోమని మోదీ సర్కారు గతంలోనే ప్రకటించింది. ఇక నిధుల విషయంలో మోదీ సర్కారు పగబట్టినట్టుగానే వ్యవహరిస్తున్నది. గిరిజన యూనివర్సిటీని ఇంతవరకూ ఏర్పాటు చేయలేదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే గతంలో మంజూరు చేసిన ఐటీఐఆర్‌ను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే.