హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో బీజేపీ నేతలు అమిత్‌షా, జీ కిషన్‌రెడ్డి పేర్లను ఎఫ్ఐఆర్ నుంచి తొలగించిన పోలీసులపై చర్య తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు టీపీసీసీ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ ఫిర్యాదు చేశారు. వీరి ప్రమేయం నిర్ధారణ కానందునే పేర్లు తొలగించినట్టు పోలీసులు పేర్కొనడంపై సోమవారం ఆయన ఒక ప్రకటనలో అభ్యంతరం వ్యక్తంచేశారు. సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసినప్పటికీ వారి ప్రమేయం లేదని పోలీసులు చెప్పడం దురదృష్టకరమన్నారు.
హైదరాబాద్‌లో మే 1న అమిత్‌షా ప్రచారసభ వేదికపై ఒక చిన్నారి బీజేపీ జెండా పట్టుకుని నినాదాలు చేసిందని, పిల్లలను ఎన్నికల కార్యక్రమాల్లో వినియోగించడం ఈ సీ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. దీనిపై ఈసీకి అదేరోజు ఫిర్యాదు చేయగా, ఆ మరుసటి రోజు మొగల్పురా పోలీస్‌స్టేషన్‌లో టీ యమన్‌సింగ్, కొంపెల్ల మాధవీలత, అమిత్‌షా, కిషన్‌రెడ్డి, రాజాసింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదైందని పేర్కొన్నారు.
తమ ఫిర్యాదుపై స్పందిస్తూ మొగల్పురా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, జూన్ 1న పంపిన లేఖలో యమన్‌సింగ్, మాధవీలత, రాజాసింగ్ పేర్లనే ఎఫ్ఐఆర్లో చేర్చామని, అమిత్‌షా, కిషన్‌రెడ్డి ప్రమే యం నిర్ధారితం కానందున వారి పేర్లను తొలగించినట్టు తెలిపారన్నారు. కోడ్ ఉల్లంఘన కేసు నుంచి తప్పించడమంటే ఈసీని తప్పుదోవ పట్టించడమేనని ఆరోపించారు.