హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : రియల్ఎస్టేట్ మాఫియా కోసమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హిల్ట్ పాలసీని తీసుకొచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ మాఫియాకు తొమ్మిది వేల ఎకరాల భూములు కట్టబెట్టే కుట్ర జరుగుతున్నదని విమర్శించారు. రాష్ర్టాన్ని ‘రెడ్ ఎస్టేట్’గా మార్చేందుకు కాంగ్రెస్ యత్నిస్తున్నదని మండిపడ్డారు. ప్రజలు కన్నీళ్లు పెట్టేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం తగదని హితవు పలికారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కారు ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): హిల్ట్ పాలసీలో ఎలాంటి స్కామ్‌కూ ఆస్కారం లేదని చెప్తున్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఈ పాలసీపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు. ఓపెన్ డిబేట్‌కు మంత్రి సిద్ధమైతే, శనివారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ మీడియా పాయింట్లో జర్నలిస్టుల సమక్షంలో చర్చకు తాను సిద్ధమని స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. హిల్ట్ పాలసీ ప్రతిపక్షాలకు అర్థంకావడం లేదనడం మంత్రి ఉత్తమ్ దివాలాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. హైదరాబాద్‌ను కాలుష్య రహితంగా, ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు పరిశ్రమలను బయటకు పంపుతున్నట్టు చెప్తున్న మంత్రి.. మరి పరిశ్రమలకు భూములు ఎక్కడ కేటాయిస్తున్నారో ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. జీవో-27ను వెంటనే రద్దుచేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం తప్పదన్నారు.