Ambedkar OverseasVidyanidhi | హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): దళిత, గిరిజనుల్లో ఇంకా వీడని సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం.. ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు ఉంటేనే అవకాశం.. విదేశీ విద్య అంటే ఆయా వర్గాలకు అందని ద్రాక్షే.. దాన్ని కలలో కూడా ఊహించని ఆ వర్గాలకు తెలంగాణ రాష్ట్రం నేడు నిజం చేసి చూపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న దన్నుతో దళిత, గిరిజన విద్యార్థులెందరో వెనుకబాటుతనం పొలిమేరలను దాటి విదేశాలకు పయనమవుతున్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నది. ఆర్థికంగానే కాకుండా అన్నివిధాలా సహకారాన్ని అందిస్తున్నది. ఉపకార వేతనాలను అందిస్తూ విదేశీ విద్య, ఉద్యోగ కలలను ప్రభుత్వం సాకారం చేస్తున్నది.
యూఎస్ఏ, స్కాట్లండ్, సింగపూర్ తదితర దేశాల ఫెలోషిప్, ఇంటర్న్‌షిప్, స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్‌లకు ఎంపికయ్యేలా తెలంగాణ ఎస్సీ, ఎస్టీ గురుకులాల సొసైటీలు పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ప్రత్యేక తర్ఫీదునిస్తున్నాయి. దీంతో దళిత, గిరిజన విద్యార్థులెందరో వివిధ ప్రోగ్రామ్‌ల కింద విదేశాలకు వెళ్లే అవకాశాలను పొందుతున్నారు. అకడమిక్స్‌లో సాధించిన మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసి, వారికి జీఆర్ఈ, ఐలెట్స్ తదితర పరీక్షల కోసం శిక్షణ ఇప్పిస్తూ, ఎంపికయ్యేలా ప్రోత్సహిస్తున్నది. ఎంపికైన విద్యార్థులకు ప్రయాణ ఖర్చులను కూడా ప్రభుత్వమే అందిస్తున్నది.
ఇప్పటివరకు పాఠశాల స్థాయిలో కెనడీ లూగర్ యూత్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం, కమ్యూనిటీ కాలేజ్ ఇనిషియేటివ్ ప్రొగ్రామ్ (సీసీఐపీ), హార్వర్డ్ సమ్మర్ క్రాస్ రోడ్స్ ప్రోగ్రామ్, యూఎస్ గ్రాండ్ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ల కింద గురుకుల విద్యార్థులెందరో విదేశీ విద్యకు ఎంపికయ్యారు. డిగ్రీ స్థాయిలో ఇంటర్నేషనల్ స్టూడెంట్, కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద బహ్రెయిన్, ఈజిప్ట్, మొరాకో, పోలండ్, రష్యా, టర్కీ, కాంబోడియా, నేపాల్, శ్రీలంక, వియత్నాం, సింగపూర్ దేశాలకు విద్యార్థులు చదువు కోసం వెళ్లారు. ఆయా ప్రోగ్రామ్‌ల కింద దాదాపు 100 మందికి పైగా గురుకుల సొసైటీ విద్యార్థులు విదేశీ విద్య కోసం వెళ్లారు
విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తున్నది. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా అట్టడుగువర్గాల కలలను సాకారం చేస్తున్నది. మాస్టర్స్, పీజీ, పీహెచ్డీ తదితర కోర్సులు చదివేందుకు ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల వరకు ఆర్థికసాయం అందిస్తున్నది. వీసా చార్జీలు, ప్రయాణ ఖర్చులకు గరిష్ఠంగా రూ.50 వేలను అందజేస్తుంది. మహిళలకు ప్రాధాన్యమిస్తూ 35 శాతం రిజర్వేషన్‌ను ప్రభుత్వం అమలు చేస్తుండటం మరో విశేషం. ఇప్పటివరకు దాదాపు 1,143 మందికి పైగా ఈ పథకం కింద విదేశాలకు వెళ్లారు. పలు ప్రముఖ వర్సిటీల్లో తెలంగాణ విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. అక్కడ ఉన్నత విద్యను పూర్తి చేసుకోవడంతో పాటు ఆయా దేశాల్లో కొలువులు పొందేలా వారి బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం బాటలు వేస్తున్నది.
దళితులు విదేశాల్లో ఉపాధి అవకాశాలను పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నది. దీనికోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నది. మొట్టమొదటి పైలట్ ప్రాజెక్టుగా నర్సింగ్, జీఎన్ఎం పూర్తి చేసిన దళిత యువతులకు విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఎంపికైన యువతులకు ఇంటర్నేషనల్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ (ఐలెట్స్), ఆక్యుపేషనల్ ఇంగ్లిష్ టెస్ట్ (ఓఈటీ)లో శిక్షణ ఇస్తున్నది. అందుకు సంబంధించిన ఐలెట్స్ ఫీజు రూ.16 వేలు, ఓఈటీ ఫీజును రూ.35 వేలతో పాటు, పాస్‌పోర్ట్ ఫీజును కూడా ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఇప్పటివరకు మొత్తంగా 406 మందికి శిక్షణ ఇవ్వగా, అందులో 160 మంది విదేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసింది. బ్రిటన్, సౌదీ అరేబియాలోని వివిధ పేరొందిన దవాఖానల్లో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఎస్సీ కార్పొరేషన్ ఇప్పటికే ఒప్పందాలు కూడా పూర్తి చేసుకున్నది. శిక్షణ పొందిన వారికి ఇటీవలే ఆఫర్ లెటర్లు కూడా రాగా, త్వరలోనే వారు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.