హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ రూపకల్పన కోసం డాక్టర్ అంబేదర్ చేసిన అధ్యయనం చిరస్థాయిగా నిలిచి ఉంటుందని, దేశ న్యాయవ్యవస్థపై అంబేదర్ ముద్ర శాశ్వతంగా ఉంటుందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు కొనియాడారు. అంబేదర్ ఆశయాలు, సిద్ధాంతాలు అందరికీ ఆచరణీయమని పేర్కొన్నారు. అంబేదర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం హైకోర్టు బార్ అసోసియేషన్‌లో జరిగిన కార్యక్రమానికి జస్టిస్ నగేశ్ భీమపాక, జస్టిస్ జీఎం మొహియుద్దీన్, జస్టిస్ సుద్దాల చలపతిరావు, జస్టిస్ వీ రామకృష్ణారెడ్డి, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. రాష్ట్ర బార్ కౌన్సిల్, హైకోర్టు బార్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు ప్రసంగిస్తూ.. కులవివక్షపై అంబేదర్ చేసిన పోరాటం చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉంటుందని, అణగారిన వర్గాల హకుల సాధన, సంక్షేమం కోసం ఆయన ఎనలేని కృషి చేశారని శ్లాఘించారు. కార్యక్రమంలో బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నరసింహారెడ్డి, సురేందర్‌రెడ్డి, పీపీ పల్లె నాగేశ్వరరావు, అసోసియేషన్ ప్రతినిధులు డీఎల్ పాండు, శ్రవణ్ కుమార్, నిరంజన్‌రెడ్డి, కృష్ణ కీర్తన, బాలాజీ, విష్ణువర్ధన్, జయసూర్య, నాగులూరి కృష్ణకుమార్‌గౌడ్ ఇతరులు పాల్గొన్నారు.