Cauvery Dispute Impact | కావేరీ జల వివాదం నేపథ్యంలో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ క్రమంలోనే తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా ప్రదర్శనలను నిలిపివేశారు. కావేరీ నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ (CWMA) ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్రంలో నిరసనలు ఉధృతమయ్యాయి. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా థియేటర్ల యజమానులు ప్రదర్శనలను రద్దు చేశారు. బెంగళూరులోని సంపిగే థియేటర్లో రోజువారీ షెడ్యూల్ చేసిన అన్ని షోలను రద్దు చేసినట్లు సమాచారం. మరోవైపు థియేటర్ సిబ్బంది కూడా విజయ్ పోస్టర్లను తొలగించడంతో పాటు, కొన్నింటిని ఇతర పోస్టర్లతో కవర్ చేశారు. తమిళ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండే శ్రీరాంపురంలో పోలీసుల పెట్రోలింగ్ పెంచడంతో పాటు సున్నితమైన ప్రాంతాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇక కర్ణాటకలోని మండ్యాలో కన్నడ అనుకూల కార్యకర్తలు ‘జన నాయగన్’ ప్రమోషనల్ బ్యానర్లను తొలగించారు. కర్ణాటక ఇప్పటికే నీటి కొరతను ఎదుర్కొంటోందని, నీటిని విడుదల చేస్తే రాష్ట్ర రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని రైతు సంఘాలు, కన్నడ సంస్థలు ఈ ఆదేశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వం ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తుందని ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ ప్రకటించారు. మరోవైపు తమిళనాడుకు కావేరీ నీటి వాటాను దక్కించుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తమిళనాడు చట్టసభ మంత్రి సి.టి.ఆర్. నిర్మల్ కుమార్ తెలిపారు. మరోవైపు ఈ ప్రదర్శనల రద్దు సినిమా పరిశ్రమపై చూపుతున్న ప్రభావంపై చర్చించేందుకు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.