గిల్గిత్: పాకిస్థాన్లో ఉన్న బ్రాడ్ పీక్ పర్వతం బేస్ వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువారం రోజు బ్రాడ్ పీక్పై కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ ఘటనలో పది మంది పర్వతారోహకులు అదృశ్యమయ్యారు. అయితే శుక్రవారం పాకిస్థాన్ ఆర్మీ సుమారు నలుగురి మృతదేహాలను గుర్తించింది. ఇంకా ఆరుగురు పర్వతారోహకుల ఆచూకీ దొరకలేదు. పాకిస్థాన్లోని కరకోరమ్ పర్వతశ్రేణుల్లో కే2గా పిలువబడే బ్రాడ్ పీక్ పర్వతం ఉన్నది. ఆ శిఖరం ఎత్తు 8,047 మీటర్లు.
మృతిచెందిన పర్వతారోహకుల్లో.. ప్రఖ్యాత నేపాలీ మౌంటనీర్ నిర్మల్ పుర్జా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మిస్సైన వారిలో ఆరుగురు నేపాలీ క్లైంబర్స్, ఓ పాకిస్తానీ, ఓ ఒమన్ దేశస్తుడు, ఓ అమెరికన్, చైనా క్లైంబర్ ఉన్నట్లు ఆల్పైన్ క్లబ్ ఆఫ్ పాకిస్థాన్ ప్రకటించింది. ప్రస్తుతం ఆచూకీ లేని ఆరుగురు మృతదేహాల కోసం గాలింపు, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 14 అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించిన రికార్డు నిర్మల్ పుర్జా పేరిట ఉన్నది. ఆయన వయసు 43 ఏళ్లు.
బేస్ క్యాంప్ వద్ద విరిగిపడ్డ కొండచరియలు సుమారు వెయ్యి మీటర్ల కిందకు నెట్టుకెళ్లాయని, దీంతో అక్కడ ఉన్న క్లైంబర్స్ ఆ శిథిలాల్లో ట్రాప్ అయినట్లు జీపీఎస్ లొకేషన్ ద్వారా తెలుస్తోందని అధికారులు చెబుతున్నారు. నిర్మల్ పుర్జా జీపీఎస్ ట్రాకర్ ఇంకా కదులుతోందని ఓ నిపుణుడు పేర్కొన్నాడు. కొండచరియలు విరిగిపడిన తర్వాత రికార్డు అయిన లొకేషన్ నిత్యం మారుతూ వస్తోందన్నారు. నిజానికి పుర్జా ఆచూనీ చిక్కకపోయినా.. అతని జీపీఎస్ కదులుతున్నట్లు పేర్కొన్నారు.
ప్రపంచంలో 8వేల మీటర్ల ఎత్తు దాటిన 14 పర్వతాలను పుర్జా మూడు సార్లు ఎక్కేశాడు. ఇక సెవన్ సమ్మిట్స్ను మూడు సార్లు అధిరోహించాడు. నేపాలీ మౌంటనీరింగ్ సంఘం అతని ఆచూకీ కోసం ఎదురుచూస్తోంది.