హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): కల్లుగీత వృత్తిదారులపై గ్రామ అభివృద్ధి కమిటీలు(వీడీసీ) చేస్తున్న దాడులు దుర్మార్గమని, ప్రభుత్వం తక్షణమే వెంటనే జోక్యం చేసుకొని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అంబాల నారాయణగౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో అనధికారికంగా గ్రామ అభివృద్ధి కమిటీలను ఏర్పాటుచేయడమే కాకుండా కమిటీల పేరిట కొందరు అనేక ఆగడాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వీడీసీలు గీత వృత్తిదారుల జోలికి వస్తే ఊరుకునేది లేదని వీడీసీలను హెచ్చరించారు. ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని, జనగామ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని, ఆత్మగౌరవ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.