హైదరాబాద్, ఫిబ్రవరి 13: ఒకటి 2001 ఫొటో, రెండోది 2022 ఫొటో.. రెండు ఫొటోల్లో ఉన్నదీ సీఎం కేసీఆరే. అప్పడు సింహగర్జన.. ఇప్పుడు రణగర్జన.. రెండు సందర్భాల్లో చేసింది కేంద్రంపై యుద్ధమే. నాడు తెలంగాణ సాధన కోసం.. నేడు తెలంగాణ సంక్షేమం కోసం.. అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నదీ క్లిప్పింగ్. ‘తెలంగాణ సాధన కోసం 2001లో కరీంనగర్లో నిర్వహించిన సింహగర్జనలో కేంద్రాన్ని దారికి తెచ్చి తెలంగాణ సాధిస్తాం అని కేసీఆర్ ఉద్ఘాటించారు. అన్నట్టే తెలంగాణను సాధించి తీసుకొచ్చారు. ఇప్పుడు ఢిల్లీ కోటను బద్దలు కొడతా అని గర్జించారు. కేసీఆర్ మాట అన్నారంటే చేసి చూపిస్తరు. తెలంగాణ కోసం తెగించి కొట్లాడుతరు’ అని నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఎనిమిదేండ్లుగా విభజన హామీలు నెరవేర్చని బీజేపీని, మోదీని తరిమేస్తారని.. విద్యుత్తు మీటర్లు పెట్టనీయకుండా రైతులను కాపాడుకొంటారని, మొత్తానికి ఢిల్లీ కోటను బద్దలు కొడుతారని తమదైన శైలిలో ట్వీట్లు, కామెంట్లు చేస్తున్నారు.