హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 45 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ సచివాలయంలో అధికారుల కేటాయింపు పూర్తి కాలేదు. మంత్రులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నా, ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేయాలన్నా పేషీలు ఎంతో ముఖ్యం. పేషీల్లో పీఎస్, అడిషనల్ పీఎస్, ఓఎస్డీ, పీఏలు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉండాలి. ఇప్పటివరకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కార్యాలయంలోని అధికారులు, కొందరు మంత్రుల దగ్గర మినహా మిగతా ఏ మంత్రి పేషీలోనూ అధికారులను, సిబ్బందిని కేటాయించలేదు. ప్రస్తుతానికి పేషీల్లో కొంతమంది సిబ్బంది కనిపిస్తున్నా, వారంతా తాత్కాలికమేనని చెప్తున్నారు. దీంతో పేషీలు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు.
అధికారులు, సిబ్బంది కేటాయింపులో అనేక నిబంధనలు పాటిస్తున్నట్టు సమాచారం. గత ప్రభుత్వంలో మంత్రుల దగ్గర పనిచేయనివారికి, బీఆర్ఎస్తో సంబంధం లేనివారికి, తమకు అనుకూలమైన వ్యక్తులకే పోస్టింగ్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. కొందరు మంత్రులు తమకు కావాల్సిన వ్యక్తుల జాబితాను సీఎంవోకు అందజేసినట్టు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే కొందరు అధికారులు, సిబ్బంది జాబితాను రూపొందించారని, ఇంటెలిజెన్స్ సిబ్బందితో వారి సమగ్ర వివరాలను పరిశీలించారని తెలిసింది. ఇందులో నుంచి తుది జాబితా సిద్ధమైందని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దావోస్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆమోదముద్ర వేస్తారని, ఆ తర్వాతే శాఖలకు సిబ్బంది కేటాయింపు పూర్తవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.