Maheshwar Reddy | భారతీయ జనతా పార్టీ గేట్లు తెరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 48గంటలు కూడా ఉండదంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేశ్వర్రెడ్డి శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తమతో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే కాంగ్రెస్ సర్కారు కూలడం తథ్యమన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వసూళ్ల చిట్టా తమవద్ద ఉందని.. హైదరాబాద్ డబ్బులు దేశ రాజకీయాల కోసం కాంగ్రెస్ వినియోగిస్తోందని ఆరోపించారు. రేవంత్రెడ్డి గతంలో రంజిత్ రెడ్డిపై చేసిన ఆరోపణలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అప్పుడు రంజిత్ రెడ్డి అవినీతి చేశారని చెప్పిన రేవంత్.. ఇప్పుడు ఆయనకే ఎన్నికల్లో ఓటు వేయాలని ఎలా అడుగుతారని నిలదీశారు. రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడండి ఏం జరుగుతుందో మీకే తెలుస్తుంది అంటూ హెచ్చరికలు జారీ చేశారు. తమ పార్టీ గేట్లు ఎత్తితే 48గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదన్నారు. నితిన్ గడ్కరీ వద్దకు వెళ్లి షిండే పాత్ర పోషిస్తానని కోమటిరెడ్డి అన్నది వాస్తవమని.. అయితే, కోమటిరెడ్డిపై ఎవరికీ నమ్మకం లేదన్నారు.