హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ పార్టీతో మీరు ఎందుకు కుమ్మక్కయ్యారు? ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు? ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకత్వం ఉండి ప్రయోజనం ఏమిటి?’ అని ఢిల్లీలోని బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర బీజేపీ నాయకులను కడిగిపారేసినట్టు సమాచారం. బీజేపీ ఎంపీలతో ఇటీవల ప్రధాని మోదీ భేటీతోపాటు, బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ హైదరాబాద్ పర్యటనలపై ఆసక్తికర అంశాలు ప్రచారంలోకి వచ్చాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ గ్రాఫ్ ఘోరంగా పడిపోయిందా? పడగొట్టారా? అనే విషయంలో పార్టీ హైకమాండ్‌కు స్పష్టత వచ్చిందని, అందులో భాగంగానే జరుగుతున్న పరిణామాలు అనే చర్చ మొదలైంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లకు, ఉపఎన్నికల్లో ఓట్లకు తీవ్ర అంతరం ఉండటాన్ని బీజేపీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించినట్టు సమాచారం. ఓట్లు పెరగాల్సిందిపోయి, అసెంబ్లీ ఎన్నికల కన్నా 8వేలకుపైగా ఓట్లు తగ్గిపోవడంపై ప్రధానంగా దృష్టిపెట్టినట్టు తెలిసింది.
ముమ్మాటికీ కాంగ్రెస్‌తో కుమ్మక్కే
బీజేపీది దేశవ్యాప్తంగా ఒక విధానం అయితే, రాష్ట్రంలో మరో పద్ధతి కొనసాగుతున్నదని అధిష్ఠాన పెద్దలు చర్చించారట. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో స్థానిక నేతలు కుమ్మక్కయ్యారని ఆ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ధారణకు వచ్చినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా నెలకొన్న వాతావరణం కూడా నిదర్శనమని పార్టీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంలోని ‘ముఖ్యనేత’కు, కేంద్రమంత్రికి మధ్య కుదిరిన రహస్య ఒప్పందంలో భాగంగానే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయనే చర్చ సాగుతున్నది. ఆ విషయం తెలిసే ప్రధాని మోదీ ఎంపీలకు క్లాస్ తీసుకున్నారని చెప్తున్నారు. ‘8 మంది ఎంపీలు, అందులోనూ ఇద్దరు కేంద్ర మంత్రివర్గంలో ఉండి ఏం లాభం? స్వప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే సహించేది లేదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మీద మనం పోరాడుతుంటే తెలంగాణలో పరిస్థితులు విరుద్ధంగా ఎందుకు ఉన్నాయి?’ అని రాష్ట్ర ఎంపీల తీరుపై మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారనే సమాచారం.
అనుకున్నదేమిటి? జరిగిందేమిటి?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ముందు పార్టీ జాతీయ నాయకత్వం అనుకున్నది ఏమిటీ? అసలు జరిగింది ఏమిటీ? అనే ప్రశ్నలకు పార్టీ వర్గాలు పలు ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలకు ముందు పార్టీ హైకమాండ్ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో సంప్రదింపులు జరిపిందట. ఆయన రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని వివరిస్తూ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తే పార్టీకి కనీసం 40వేల ఓట్లు వస్తాయని కుండబద్దలు కొట్టినట్టు సమాచారం. దీంతో ప్రస్తుతం అలాంటి వాతావరణమే ఉన్నదని, 50వేల ఓట్లు వచ్చినా ఆశ్చర్యం లేదని ఒక దశలో పార్టీ భావించిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఎంపిక, ప్రచార బాధ్యతలు, అనుసరించాల్సిన వ్యూహరచన బాధ్యతలను పార్టీ హైకమాండ్ కిషన్‌రెడ్డికే అప్పగించిందట. అభ్యర్థిని ముందుగా ప్రకటించే అవకాశాలున్నా, ఉద్దేశపూర్వకంగానే దీపక్‌రెడ్డి పేరును కిషన్‌రెడ్డి ఆలస్యంగా ప్రకటించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వెనుక కాంగ్రెస్ వ్యూహం ఉన్నదనే వాదన వినిపిస్తున్నది. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఇటీవల ఢిల్లీకి వెళ్లగా, కొంతమంది పాత్రికేయులు కలిసి ‘ఎందుకిలా తలకిందులైంది?’ అని ఆరా తీశారట. దీనికి ఆయన ‘కిందిస్థాయిలో వాతావరణం బాగున్నది. మొదట్లో క్యాడర్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. గతంలో కన్నా ఈసారి ఓట్లు బాగా వస్తాయని అనుకున్నాం. కానీ, పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పార్టీది ఫైటింగ్లైన్.. కానీ, లోకల్‌గా సహాయ నిరాకరణ, ఎక్కడికక్కడ కట్టేసే వాతావరణం సృష్టించారు. ఈ క్రమంలో నేనేం చేయలేకపోయాను’ అని చెప్పినట్టు సమాచారం. ఇవన్నీ తెలిసే ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర బీజేపీ నేతలపై ఆగ్రహించారని చెప్పుకుంటున్నారు.