కంటోన్మెంట్, జూలై 17: రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో వరుస కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ పార్క్, జేబీఎస్ సమీపంలో వెలిసిన ఓ భారీ హోర్డింగ్ చర్చనీయాంశంగా మారింది. రేవంత్ పాలనలో ఏ టు జడ్ అక్షరాలతో మొదలయ్యే చాలా కుంభకోణాలు జరిగాయని పేర్కొన్నారు. ఏ అక్షరంతో మొదలై వై అక్షరం వరకు కుంభకోణాలను పేర్కొన్నారు. కానీ జడ్ అక్షరం వద్ద ‘కమింగ్ అప్ సూన్’ అని పేర్కొన్నారు. దీంతో జడ్ అక్షరంతో మొదలయ్యే ఆ కుంభకోణం ఏమై ఉంటుందా అనే ఉత్కంఠను రేకెత్తించారు.
ఇందులో ప్రధానంగా రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డి అమృత్ కాంట్రాక్ట్ రూ.1137 కోట్లు, డిండి ప్రాజెక్టు కాంట్రాక్ట్ రూ.366 కోట్లు, హైడ్రా బ్లాక్‌మెయిలింగ్ కూల్చివేతలు, జగదీశ్ అనుముల స్వచ్ఛబయో రూ.1,000 కోట్ల డీల్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రకృతి విధ్వంసం వెనుక రూ.10,000 కోట్ల ఒప్పందం, సీఎం తమ్ముడు తిరుపతిరెడ్డికి వీఐపీ స్టేటస్, రియల్ ఎస్టేట్ తదితరాలపై కుంభకోణం ఆరోపణలను ప్రస్తావించారు.