KGBV | హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): కమీషన్ల రాజ్యంలో మరో అవినీతి బాగోతం వెలుగు చూసింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్న పాఠశాల విద్యావిభాగంలో రూ.163 కోట్ల టెండర్లపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) విద్యార్థినుల కోసం కొనుగోలు చేస్తున్న బంకర్ బెడ్ల టెండర్లలో దోపిడీకి తెరదీసినట్టు ఆ శాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకో మంచం ఖరీదును వంద శాతం పెంచి, అస్మదీయులకు టెండర్లు కట్టబెట్టేందుకు రంగం సిద్దం చేశారని చెప్పుకుంటున్నారు. రూ.17 వేలు ఖర్చయ్యే యూనిట్ ధరను రూ.36 వేలకు పెంచినట్టు ఆరోపిస్తున్నారు.
సర్వశిక్ష అభియాన్ కింద రాష్ట్రవ్యాప్తంగా 495 కేజీబీవీ పాఠశాలలు రాష్ట్రంలో నడుస్తున్నాయి. వీటిలోని 252 స్కూళ్లలో విద్యార్థినుల కోసం 45,360 బంకర్ బెడ్లను, పరుపులు, దిండ్లతో సహా కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 30న ఆన్లైన్లో టెండర్లు పిలిచింది. ఈ నెల 14న గడువు ముగిసింది. ఈ టెండర్లలో నగరానికి చెందిన సంస్థ ఎల్-1గా, ముంబైకి చెందినదిగా చెప్తున్న మరో సంస్థ ఎల్-2గా నిలిచాయి. అయితే.. ఎల్-1గా నిలిచిన సంస్థ వాస్తవానికి ఓ సాఫ్ట్వేర్ సంస్థ అని, ముంబైకి చెందిన మెథోడెక్స్ అనే కంపెనీ నుంచి ఒరిజినల్ ఎక్విప్మెంట్ మానుఫ్యాక్చర్ సర్టిఫికెట్ (వోఈఎం) తెచ్చుకున్నదని, ఎల్-2 కూడా అదే సంస్థ నుంచి వోఈఎం తెచ్చుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రెండు సంస్థలకు సప్లయర్ ఒక్కరే.. సరఫరా చేసే మెటీరియల్ కూడా ఒక్కటే. దీనిని బట్టే రెండు సంస్థలూ ముందే కూడబలుకొని రెండు టెండర్లు వేసినట్టు ఆరోపిస్తున్నారు. వాస్తవ ధరకు రెట్టింపు కోట్ చేసినా ఆ సంస్థలకే టెండర్లు దక్కడం వెనుక ఏదో మతలబు ఉన్నదని చర్చించుకుంటున్నారు. టెండర్ నోటిఫికేషన్ ప్రకారం ఒకో మంచం బరువు 72.28 కిలోలు ఉండాలి. పరుపు 3 ఇంచుల మందం ఉంటే చాలు. వీటితోపాటు రెండు కాటన్ దిండ్లు సరఫరా చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి మనం వాడే పరుపుల కనీస మందం 4 ఇంచులు. కానీ.. విద్యార్థినులకు ప్రతిపాదించిన పరుపు మందం 3 ఇంచులు మాత్రమే ఉండటం గమనార్హం.
ప్రస్తుతం మార్కెట్లో 32 ఎంఎం ఇనుప రాడ్ ఖరీదు కిలో దాదాపు రూ.77 ఉన్నది. ఈ లెక్కన ఒకో మంచాన్ని పూర్తిగా ఇనుముతో తయారు చేసినా రూ.ఏడు వేలకు మించి ఖరీదు కాదని, తయారీ ఖర్చు కలిపినా రూ.10 వేలకు మించదని నిపుణులు పేర్కొంటున్నారు. పరుపు, దిండ్లు కలిపి, సమంజసమైన మార్జిన్ వేసుకున్నా గరిష్ఠంగా రూ.17వేలకు మించదని స్పష్టం చేస్తున్నారు. కానీ, ఎల్ 1గా నిలిచిన సంస్థ ఏకంగా ఒకో యూనిట్ ఖరీదు రూ.36 వేలుగా కోట్ చేసినట్టు తెలిసింది. దీంతో దాదాపు రూ.78 కోట్లతో పూర్తి కావాల్సిన బంకర్ బెడ్ల సరఫరా.. రూ.163 కోట్లకు పెరిగిపోయిందని చర్చ జరుగుతున్నది.
ప్రభుత్వ పెద్దల జోక్యంతోనే ఈ వ్యవహారం సాగుతున్నదని అనుమానిస్తున్నారు. టెండర్ నోటిఫికేషన్లోనే ఆయా సంస్థల ప్రొఫైల్స్‌కు అనుగుణంగా నిబంధనలు ఉండేలా జాగ్రత్తపడినట్టు ఆరోపిస్తున్నారు. దీంతో అస్మదీయ కంపెనీలే టెండర్లు వేశాయని, వాటికే కాంట్రాక్టు కట్టబెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎల్-1కు 70శాతం సరఫరా కాంట్రాక్టు, ఎల్-2కు 30 శాతం కాంట్రాక్టును ఇవ్వనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.