హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీలోని అన్ని ట్రేడ్ యూనియన్లు ఒకే జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)గా ఏర్పడి సమస్యలపై పోరాడాలని నిర్ణయించాయి. సంఘాలు ఇటీవల వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడంతో సమ్మె నోటీసులను ప్రభుత్వం తక్కువగా అంచనా వేసిందని అభిప్రాయపడ్డాయి. ఈ క్రమంలో వేర్వేరుగా ప్రభుత్వం చర్చలు జరిపి సమ్మెను నిర్వీర్యం చేసిందని, ఫలితంగా డిమాండ్లు సాధించుకోలేకపోయామని తెలిపాయి.
శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ సమావేశం చైర్మన్ ఈదురు వెంకన్న అధ్యక్షతన జరిగింది. జేఏసీ తరఫున అశ్వత్థామరెడ్డి, టీఎంయూ నుంచి రాజలింగం, ఎన్ఎంయూ నుంచి కమల్‌రెడ్డి, ఎస్‌డబ్ల్యూఎఫ్ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు సమావేశానికి హాజరయ్యారు.
చైర్మన్ ఈదురు వెంకన్న, కో చైర్మన్ కే హనుమంతుముదిరాజ్, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో కన్వీనర్ కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, బీ యాదగిరి మాట్లాడారు. ఇకపై అందరం కలిసి ఒకే ఎజెండాగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. దీనికి కార్మిక సంఘాలన్నీ సానుకూలంగా స్పందించాయి. ఈ నెల 24న మరో సమావేశం ఏర్పాటు చేసి ఉమ్మడిగా కార్యచరణ ప్రకటిస్తామని ఆయా సంఘాల నేతలు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు బీ యాదయ్య, మీడియా ఇన్చార్జి పీ అప్పారావు, ఎం వెంకట్‌గౌడ్, ఎన్ కమలాకర్, గోలి రవీందర్, రహీమొద్దీన్, స్వాములయ్య, రాములు, రామ్‌చందర్, రాంరెడ్డి, ఏ జ్యోతి, మజీద్, బీ బాబు, కేఎస్పాల్, పాపయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.