హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ) : అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా… ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన ఒక్క హమీని నెరవేర్చరా..? అంటూ పెన్సనర్స్ జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య సర్కారును ప్రశ్నించారు. పెన్షనర్ల పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. పెన్షనర్ల జేఏసీ కోర్ కమిటీ సమావేశాన్ని సోమవారం హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఐదు డీఏలు పెండింగ్లో ఉండటం గర్హనీయమని మండిపడ్డారు. ఒక డీఏ ఇస్తామని సర్కారు పెద్దలు లీకులిస్తున్నారని, ఒక డీఏ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని, పెండింగ్ డీఏలను విడుదల చేయాల్సిందేనని స్పష్టంచేశారు. 15 నెలలుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడంలేదని, రిటైర్డ్ ఉద్యోగులంతా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.
చేపపిల్లల పంపిణీ ఇంకెప్పుడు? ; పథకంపై స్పష్టత కరువు సిద్ధంకాని అధికారులు మత్స్యకార సంఘాల గరం
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): అధికారుల ప్రణాళికల లోపం మత్స్యకారులను ఆందోళనకు గురిచేస్తున్నది. చేపపిల్లల పంపిణీ కోసం ఏప్రిల్లో టెండర్లు పిలిచి, మే రెండో వారం నాటికి చేపపిల్లలను సమకూర్చుకోవాలి. జూన్ నుంచి ఆగస్టు మధ్యలో వాటిని చెరువులు, కుంటల్లో వదలాల్సి ఉంటుంది. 2016లో కేసీఆర్ ప్రభుత్వం పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇదే ప్రణాళికను అమలు చేసింది. కానీ నిరుడు కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్లో చేపలను వదిలారు. చేపలు సరైన సైజులో పెరగకపోడంతో మత్స్యకారులు నష్టపోయారు. అధికారులు ఈ ఏడాది గుణపాఠం నేర్చుకోలేదని మత్స్య సం ఘాల నేతలు మండిపడుతున్నారు.