మునుగోడు, సెప్టెంబర్ 27: కొంతమంది బడా రాజకీయ నాయకుల అండదండలతోనే రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చడానికి కుట్రలు చేశారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయడానికి ముఖ్యమంత్రితో మాట్లాడుతామని తెలిపారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు ఎంత దూరమైనా వెళ్తానని స్పష్టంచేశారు. ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం రహదారి కింద మునుగోడు నియోజకవర్గంలో భూములు కోల్పోతున్న చౌటుప్పల్, నారాయణ్ పూర్, గట్టుప్పల్, మర్రిగూడెం మండలాలకు చెందిన భూ నిర్వాసితులు శనివారం మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ఇది చాలా సున్నితమైన అంశమని పేర్కొన్నారు. ‘భూమి కోల్పోతున్న మీరు పడుతున్న ఆవేదన నాకు తెలుసు. మీ డిమాండ్లను ఏకీభవిస్తున్నా.
పార్టీ కంటే, ప్రభుత్వం కంటే ప్రజలే ముఖ్యం అనే భావనతో ఆలోచన చేస్తున్న. భూ నిర్వాసితులకు న్యాయం చేయడానికి ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగంలోని ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడుతున్న. ఈ విషయంలో అందరు ఎమ్మెల్యేలు ఆవేదనతో ఉన్నారు. దక్షిణ భాగంలో అలైన్మెంట్ మార్చి, దివిస్ కంపెనీకి లాభం చేకూరేలా చేసి రైతుల పొట్టకొడుతున్నరు. భూ నిర్వాసితులకు భూమి పోతే జీవనమే పోతుందని నాకు తెలుసు. భూ నిర్వాసితులకు న్యాయం చేస్తా. అధికార పార్టీలో ఉన్నప్పటికీ ప్రజల పక్షాన మాట్లాడుత. పదవి అంటే కిరీటం కాదు. పదవి అంటే బాధ్యత. ధర్మం వైపు.. న్యాయం వైపు ఉంటా’నని చెప్పారు. అలైన్మెంట్ మార్చడానికి కారణాలను రైతులకు వివరించి ఒప్పించి నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. చౌటుప్పల్ వరకు వచ్చేసరికి ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను దగ్గరికి తీసుకొచ్చారని, అలైన్మెంట్ విషయంలో ఉత్తర భాగంలోనే తప్పు జరిగిందని పేర్కొన్నారు. ఇప్పుడు దక్షిణ భాగంలోనూ ఆ తప్పును కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.