కొత్త మద్యం దుకాణాలు వచ్చి రెండు నెలలు కాకముందే సిండికేట్ మాఫియా పడగవిప్పింది. ఇటీవల జిల్లాలవారీగా సమావేశమైన లిక్కర్ సిండికేట్లు ఎక్సైజ్‌శాఖను, మద్యం వ్యాపారాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. సర్కార్ మద్యం సీసాకు సిండికేట్ సొంత స్టిక్కర్లు వేసుకుని బెల్ట్‌షాపుల్లో విక్రయించేందుకు సిద్ధమయ్యారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 3(నమస్తే తెలంగాణ) : కొత్త మద్యం దుకాణాలు మొదలై నిండా రెండు నెలలు కాలేదు. అప్పుడే లిక్కర్ సిండికేట్లు మార్కెట్లోకి వచ్చి, ఎక్సైజ్ శాఖ ను, మద్యం వ్యాపారాన్ని గుప్పిట్లోకి తెచ్చుకున్నారని ప్రచారం జరుగుతున్నది. అంతేకాదు.. నయాట్రెండ్‌ను అమల్లోకి తెచ్చారని చెప్పుకొంటున్నారు. ఇటీవల జిల్లాలవారీగా సిండికేట్లు సమావేశమైనట్టు విశ్వసనీయ సమాచారం. ఏ4 మద్యం దుకాణ పరిధి గిరిగీసి, ఆ పరిధిలోకి వచ్చే గ్రామాల్లో బెల్ట్‌షాపులను పంచుకున్నట్టు స మాచారం. ప్రతి మద్యం సీసా మీద ప్రభు త్వం అతికించే హెడ్సీవ్ లేబుల్ సహా సిండికే ట్ ఉనికిని తెలిపే సిక్కర్లు కూడా కచ్చితంగా అ తికించాలని, ఆ స్టికర్లు ఉన్న సీసాలనే బెల్టు షాపుల్లో విక్రయించాలని తీర్మానించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఒక వైన్ షాపునకు కేటాయించిన బెల్టు దుకాణాల్లోకి వేరొక మద్యం దుకాణాల వారు సరుకు ఇవ్వకుండా నిరోధించడానికి ఈ ఏర్పాట్లు చేసుకుంటున్న ట్టు చెప్తున్నారు. సిండికేట్ తీర్మానం మేరకు రా ష్ట్రవ్యాప్తంగా సర్కార్ మద్యం సీసాకు చట్టవిరుద్ధంగా సిండికేట్ స్టిక్కర్‌ను కూడా అతికించి గు ట్టుగా విక్రయిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. బెల్ట్‌షా పుల్లో ఒకో క్వార్టర్ సీసా, బీరు బాటిల్‌పై ఎమ్మార్పీకి అదనంగా రూ.15 నుంచి రూ.20 వరకు అమ్ముతున్నట్టు తెలిసింది.
ఎక్సైజ్ అధికారుల సమక్షంలోనే అన్ని జి ల్లాల్లో సిండికేట్లు విధివిధానాలు ఖరారు చేసుకుంటున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో 2,620 వైన్ షాపులు ఉన్నాయి. వీటికి అనుబంధంగా గ్రామాల్లో 1.45 లక్షల బెల్ట్‌షాపులు నడుస్తున్నట్టు చెప్తున్నారు. వీటి ద్వారా ఏటా 3.6 కోట్ల కార్టన్ల లికర్, 5 కోట్ల కార్టన్ల బీర్లను విక్రయిస్తున్నట్టు ఆబ్కారీ శాఖ లెక్కలు చెప్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెద్దగా బెల్ట్ దు కాణాలు లేవు. కానీ గ్రామీణ, పట్టణ ప్రాంతా ల్లో ప్రతి ఒక ఏ4 వైన్ షాప్నకూ కనీసం 74 మద్యం దుకాణాలు ఉన్నట్టు ఎక్సైజ్ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది చెప్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ4 షాపుల్లో ఎమ్మార్పీ ఉల్లంఘన జరుగకుండా చర్యలు తీసుకున్నది. ఇప్పుడు అనివార్యంగా అవే నిబంధనలు అ మలుచేయాల్సి వస్తున్నది. దీంతో సిండికేట్లు బెల్ట్‌షాపుల విక్రయాలను ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. నిబంధనల ప్రకారం లిక్కర్ డిపో నుంచి ఏ4 షాప్ గోదాం వరకే మద్యం రవాణా పర్మిట్ ఉంటుంది. అక్కడినుంచి మూడు సీసాల కంటే ఎక్కువ తీసుకెళ్తే కచ్చితంగా రూట్ పర్మిట్ పత్రం అవసరం. కానీ మద్యం సిండికేట్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రత్యేక వాహనాల్లో గ్రామాలకు మద్యం సరఫరా చేస్తున్నట్టు సమాచారం. వ్యాన్లల్లో పాల ప్యాకెట్లు సరఫరా చేసినంత సులువుగా మద్యాన్ని ప్రతి బెల్ట్షాపునకూ సరఫరా చేస్తున్నట్టు చర్చ జరుగుతున్నది.
బెల్ట్ షాపులపైనా అజమాయిషీ కోసం ప్రైవే ట్ వ్యక్తులతో వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు సమాచారం. ప్రతి వైన్‌షాపు పరిధిలో ఐదు నుంచి ఏడుగురు వ్యక్తులు ఉన్నట్టు చెప్తున్నా రు. వీరికి ప్రత్యేక వాహనాలు కేటాయించడం తో తమ దుకాణం పరిధిలోని 74 బెల్టు దుకాణాలను పర్యవేక్షిస్తారని తెలిసింది. దుకాణాలకు మద్యం సరఫరా చేయడం, ఇతర దుకాణాల మద్యం రాకుండా చూడటం వీరి బాధ్యతగా చెప్తున్నారు. సీసాలపై తమ దుకాణానికి చెందిన స్టికర్ ఉంటేనే విక్రయానికి అనుమతిస్తారని, లేదంటే ఎక్సైజ్ పోలీసులకు ఫోన్‌చేసి చెప్తున్నట్టు తెలిసింది. స్టిక్కర్ లేని బెల్టు దు కాణదారుల మీద అధికారులు కేసులు పెడతారని, ఎంత సరుకు ఉంటే అంత సరుకును ఇల్లీగల్ లిక్కర్‌గా గుర్తించి స్వాధీనం చేసుకుంటారని సమాచారం. మద్యం మార్కెట్‌పై సిండికేట్లు పట్టు సాధిస్తున్నా.. స్థానిక ఎక్సైజ్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు న్నాయి. కొన్నిచోట్ల నేరుగా మద్యం షాపుల్లో విక్రయాలను నిరుత్సాహపరుస్తున్నారని, బెల్ట్ షాపులకు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నారని తెలుస్తున్నది. ఇందుకోసం షాపులను గంట ఆలస్యం గా తెరువడంతో పాటు గంట ముందే మూసివేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. బెల్టు దుకాణాలను మాత్రం 24 గంటలు తెరిచి ఉంచుతున్నారని మండిపడుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సరిగ్గా ఇలాంటి మద్యం సిండికేట్ వ్యాపారమే జరిగిందని సీనియర్ ఎక్సైజ్ అధికారులు గుర్తుచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అడ్డూఅదుపు లేకుండా ధరలు పెంచి దోచుకున్నారని తెలిపారు. పరిస్థితి విషమించడంతో ఏసీబీ మెరుపు దాడులకు దిగిందని, ఈ దాడుల్లో 70శాతం ఎక్సైజ్ అధికారుల మీద కేసులు నమోదు చేయడాన్ని గుర్తుచేశారు. అప్పట్లో సిండికేట్ రింగ్ మాస్టర్లుగా ఉన్న వ్యక్తుల మీద ఉక్కుపాదం మోపినట్టు చెప్తున్నారు. దాదాపు 14 ఏండ్లు అదుపులో ఉన్న సిండికేట్ మళ్లీ పడగ విప్పుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఏసీబీ ఈ అంశంపై దృష్టి సారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.