అలంపూర్, జూన్ 4: అక్రమ అనుమతులతో చేపట్టిన ఇథనాల్ కంపెనీ నిర్మాణ పనులను అడ్డుకున్న రైతులపై కేసులు పెట్టడం దారుణమని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజోళి మండలానికి చెందిన సుమారు 100 మంది రైతులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్స్టేషన్లలో ఉంచడం సరికాదని పేర్కొన్నారు. రైతులు, స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్న ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తున్నదని ఆరోపించారు. బుధవారం ఆయన మానవపాడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులు అరెస్టు చేసిన రైతులను పరామర్శించారు.
డీఎస్పీ మొగులయ్యతో మాట్లాడారు. రైతులను బేషరతుగా వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. అంతవరకు ఇక్కడే ఉంటానని భీష్మించుకూర్చున్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. నాలుగు గ్రామాలకు చెందిన 50 మందికిపైగా రైతులను అరెస్టు చేసి, వారిని ఎక్కడ ఉంచారో కూడా తెలియకుండా కుటుంబ సభ్యులను భయపెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కంపెనీకి కొమ్ముకాస్తున్నాయని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిలబడి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలిపారు.