మరికల్/కౌకుంట్ల, ఏప్రిల్ 30 : ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సూచించారు. నాడు కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి చెక్‌డ్యాంలను నిర్మిస్తే నేటి కాంగ్రెస్ సర్కార్ రైతుల సంక్షేమాన్ని విస్మరించి ప్రజల ఆస్తిని కొల్లగొడుతున్నదని ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా బస్వాపూర్ సమీపంలో కాంగ్రెస్ నాయకులు, ఇసుక మాఫియా చెక్‌డ్యామ్‌ను ధ్వంసం చేసిన ప్రాంతాన్ని గురువారం స్థానిక రైతులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. చెక్‌డ్యామ్‌ను ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ వాగు వద్ద ధర్నాకు దిగారు.
ఈ సందర్భంగా ఆల మాట్లాడుతూ.. నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దులోని ఊకచెట్టు వాగుపై నాటి సీఎం కేసీఆర్ సహకారంతో పేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి నిధులు మంజూరు చేయించి రెండు కిలోమీటర్లకు ఒక చెక్‌డ్యాం నిర్మించినట్టు గుర్తుచేశారు. దీంతో వేసవిలోనూ చెక్డ్యామ్లన్నీ జలకళను సం తరించుకున్నాయని తెలిపారు.
బస్వాపూర్-రాకొండ మధ్య రూ.5.80 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యామ్‌ను దేవరకద్ర కాంగ్రెస్ నాయకులు అంజిల్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి అర్ధరాత్రి హిటాచీతో కూల్చడానికి యత్నించగా అప్రమత్తమైన రాకొండ రైతు మొగులప్ప ప్రాణలకు తెగించి అడ్డుకొని కాపాడారని తెలిపారు. రైతుతో పాటు నీటిపారుదల శాఖాధికారులు, కాంట్రాక్టర్ దేవర్కద్ర పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు వారిని అరెస్ట్ చేయడంలేదని ప్రశ్నించారు.