పెగడపల్లి, జూలై 29: బ్లడ్ క్యాన్సర్‌తో రెండేండ్లుగా పోరాడిన చిన్నారి అక్షిత చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నరసింహునిపేటకు చెందిన అన్నారపు మల్లయ్య-కరుణ దంపతులకు కూతురు అక్షిత (7). కొడుకు ఉన్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబమైనా పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. కానీ విధి వెక్కిరించింది. ఐదేండ్ల వయసులోనే అక్షిత బ్లడ్ క్యాన్సర్ బారిన పడి రెండేండ్లు నరకయాతన అనుభవించింది. బిడ్డను కాపాడుకునేందుకు అమ్మానాన్నలు రూ.15లక్షల దాకా అప్పుచేశారు.
కొద్దిరోజులుగా కరీంనగర్‌లోని ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నది. చేతిలో డబ్బులు లేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతుండడంతో ‘అక్షితను బతికించండి’ అనే శీర్షికన నమస్తే తెలంగాణలో ఈ నెల 21 కథనం ప్రచురితం కాగా, ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా రూ.1.75 లక్షల సాయం అందింది. కానీ వ్యాధి తీవ్రత ఎక్కువై చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ‘ఎంత పనాయె బిడ్డా. నిన్ను బతికించుకునేందుకు ఎన్నో తిప్పలవడ్డా దక్కకపోతివి బిడ్డా’ అంటూ కూతురు మృతదేహంపై పడి రోదించిన తీరు గ్రామస్థులను కలిచివేసింది. మంగళవారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.